
గాలిలో కూలిపోతే ఎవరు బాధ్యులు?
ఆయిల్ కాంట్రాక్టర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌లో కల్తీకి పాల్పడితే వాహనాలు రోడ్డుపై ఆగిపోతాయని, విమాన ఇంధనం కల్తీ చేస్తే ఎక్కడ ఆగాలని పిటిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్తీ కారణంగా విమానం కూలి మనుషుల ప్రాణాలుపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. కనీస మానవత్వం అంటూ లేకుండా అక్రమాలకు పాల్పడితే ఎలా ఉపేక్షించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాంట్రాక్టు పునరుద్ధరించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఎంత మాత్రం ఆమోదించబోమని.. కొట్టివేసింది.
ట్యాంకర్లలో ఇంధనాన్ని కల్తీ చేస్తున్నారని సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కాంట్రాక్టు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ కాంట్రాక్టర్ గురునాథం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక మంగళవారం విచారణ చేపట్టారు. ఆయిల్ ట్యాంకర్లో ఏదో శబ్దం వస్తుండటంతో నిలిపి పైకెక్కి చూశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీన్ని కొందరు వీడియోలు తీసి కల్తీ అంటూ సోషల్ మీడియాలో పెట్టారన్నారు.
కల్తీపై విచారణ జరపకుండానే కాంట్రాక్టు రద్దు చేయడం సరికాదని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. విమాన ఇంధనంలో కల్తీకి పాల్పడితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మార్గాల్లో సంపాదించే డబ్బు తప్ప ప్రజల ప్రాణాలు కనిపించవా అని ప్రశ్నించారు. కాంట్రాక్టు రద్దు చేయడంలో జోక్యం చేసుకోబోమంటూ.. పిటిషనర్‌కు రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.