
గరిడేపల్లి పీఎస్‌లో కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో 2019లో నమోదైన కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తుదిఉత్తర్వులు జారీ చేసింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు గరిడేపల్లి పీఎస్‌లో అప్పటి ఎంపీ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై 2019, జనవరి 19న ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
ఎలాంటి అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పొనుగోడులో సమావేశం నిర్వహించారన్నది ఫిర్యాదు. ఆధారాలు లేకుండా తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి.. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు.
ట్రయల్‌కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు..
వరంగల్ జిల్లా కమలాపూర్ పీఎస్‌లో నమోదైన కేసులో ట్రయల్ కోర్టుకు హాజరు నుంచి రేవంత్‌రెడ్డికి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను, ఫిర్యాదుదారును ఆదేశించింది. తదుపరి విచారణ సెపె్టంబర్ 9కి వాయిదా వేసింది. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి దాదాపు 2,500 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారన్న ఫిర్యాదు మేరకు రేవంత్‌పై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు.