
రేపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న ట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నైరు తి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వచ్చే రెండ్రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
26 మండలాల్లో ఇంకా లోటు...
జూన్, జూలై, ఆగస్టులలో 57.3 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 72.06 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. జిల్లాలవారీగా చూస్తే 8 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 10 జిల్లాల్లో అధికం, 15 జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. అత్యధికంగా మెదక్ జిల్లాలో 90 శాతం అధిక వర్షాలు నమోద య్యాయి.136 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 238 మండలాల్లో అధికం, 221 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా 26 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
నిలకడగా గోదావరి
కాళేశ్వరం: గోదావరినది నిలకడగా ప్రవహిస్తోంది. ఆదివారం కాళేశ్వరం వద్ద పుష్కరఘాట్లను తాకుతూ 12.500 మీటర్ల ఎత్తులో నీటిమట్టం దిగువకు ప్రవహించింది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాళేశ్వరానికి ఎగువ ఉన్న అన్నారం బరాజ్ నుంచి వద్ద 3.56 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. మొత్తం 66 గేట్లు ఎత్తి ఉంచడంతో అక్కడి నుంచి కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహితనదితో కలిసి పరవళ్లు తొక్కుతోంది. మేడిగడ్డ బరాజ్‌కు 8.19 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 85 గేట్లు ఎత్తి నీటిని అదేస్థాయిలో దిగువకు వదులుతున్నారు.