సెలెక్ట్‌ కమిటీకి విద్వేష బిల్లు | Hate Bill to Telangana Select Committee | Sakshi
Sakshi News home page

సెలెక్ట్‌ కమిటీకి విద్వేష బిల్లు

Mar 31 2026 4:15 AM | Updated on Mar 31 2026 4:15 AM

Hate Bill to Telangana Select Committee

రాష్ట్ర శాసనసభ తీర్మానం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్వేష ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లు–2026ను సెలెక్ట్‌ కమిటీకి పంపాలని శాసనసభ తీర్మానించింది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టగా, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ తీవ్రంగా వ్యతిరేకించడంతో దానిని సెలెక్ట్‌ కమిటీకి పంపాలని శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రతిపాదించారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. సెలెక్ట్‌ కమిటీ ఎంపిక అధికారాన్ని స్పీకర్‌కు కట్టబెడుతూ తీర్మానం చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్వేష పూరిత ప్రసంగాలు, విద్వేష పూరిత నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా పటిష్టమైన చట్టం అవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సభలో బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 

కక్ష సాధింపు ఉండదు 
వాక్‌ స్వాతంత్య్రాన్ని హరించడానికి ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని విపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను పొన్నం తోసిపుచ్చారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా ఆర్టికల్‌ 19(1)(ఏ)లో వాక్‌ స్వాతంత్య్రాన్ని చేర్చి దాని తో పాటే సహేతుకమైన పరిమితులను విధించిన విషయాన్ని గుర్తు చేశా రు. తెలంగాణ ఎల్లప్పుడూ గంగా–జమున సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని, వివిధ మతాలు, సంస్కృతులు కలిసి మెలిసి జీవించే రాష్ట్రంగా గుర్తింపు పొందిందని చెప్పారు. అయితే ఇటీవలి కాలంలో ముఖ్యంగా సోషల్‌ మీడియా వేదికల ద్వారా విద్వేష ప్రసంగాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

సమాజంలో మనుషులు, సమాజం మధ్య ఇవి విభేదాలను పెంచి శాంతి, సామరస్యానికి ముప్పు కలిగిస్తున్నాయని అన్నారు. ప్రస్తుత చట్టాలు మారుతున్న పరిస్థితులకు సరిపోవడం లేదని, అందుకే కొత్త చట్టం అవసరమైందని పేర్కొన్నారు. అయితే ఎవరి పట్ల కక్ష సాధింపు ఉండదని స్పష్టం చేశారు. పదాలు, సంకేతాలు, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్లు మొదలైనవన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయని వివరించారు. ఈ చట్టం కింద నమోదయ్యే నేరాలు విచారణార్హమైనవిగా, బెయిల్‌ ఇవ్వలేనివిగా ఉంటాయని మంత్రి వివరించారు. విద్వేషపూరిత కంటెంట్‌ను వెంటనే తొలగించే అధికారాన్ని సంబంధిత అధికారులకు ఇచ్చినట్లు, పునరావృత నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే అధికారాన్ని మేజిస్ట్రేట్‌లకు కల్పించినట్లు తెలిపారు. కాగా బాధితులకు పరిహారం కల్పించే విధానాన్ని కూడా బిల్లులో చేర్చినట్లు చెప్పారు.
  
ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనే కుట్ర: బీజేపీ 
బిల్లుపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణచి వేయడానికి ఈ బిల్లును తెచ్చారని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శాంతిభద్రతల పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టం మానవ హక్కుల ఉల్లంఘనలా ఉందని చెప్పారు. సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కక్ష సాధించే విధంగా నిబంధనలు ఉన్నాయని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించే ప్రయత్నంగా ఈ బిల్లును అభివర్ణించారు. ఆధారాలు లేకుండానే అరెస్టులు చేసే అవకాశం కల్పిస్తోందని, నేరం రుజువు కాకముందే జైలుకు పంపేలా నిబంధనలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్, పైడి రాకేష్‌రెడ్డి కూడా మాట్లాడారురు.  

బిల్లును ఉపసంహరించుకోవాలి: ఎంఐఎం, సీపీఐ 
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగేలా ఉన్న బిల్లును ఉపసంహరించుకోవాలని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు కోరారు. ఇలాంటి చట్టాలు బ్రిటిష్‌ కాలంలో ఉండేవని, ప్రస్తుతం మళ్లీ వాటిని తీసుకురావడం వల్ల ప్రజల హక్కులకు, ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్లుతుందని అన్నారు. ఎంఐఎం సభ్యుడు అహ్మద్‌ బిన్‌ బలాలా మాట్లాడుతూ.. మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సెలెక్ట్‌ కమిటీకి పంపించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.  

ఈ చట్టం అవసరం: కాంగ్రెస్‌ సభ్యులు 
విద్వేషపూరిత ప్రసంగాలను, కంటెంట్‌ను నిరోధించేందుకు తెచ్చిన ఈ చట్టం స్వాగతించదగినదని, అదే సమయంలో బిల్లు ద్వారా వచ్చే అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ సభ్యుడు వంశీకృష్ణ అన్నారు. మాట్లాడే హక్కు పేరుతో స్టేజీల మీద, సోషల్‌ మీడియాలో వ్యక్తులను, సమూహాలను ఇష్టానుసారంగా తూలనాడే స్థితికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ రాగమయి, లక్ష్మారెడ్డి, యశస్వినిరెడ్డి, శంకరయ్య, కేఆర్‌ నాగరాజు, నారాయణ్‌ గణేష్‌, మరో సభ్యుడు దానం నాగేందర్‌ అభిప్రాయపడ్డారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement