
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్–1 పరీక్ష మళ్లీ నిర్వహించాలి
మంత్రుల వసూళ్లపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రులు గ్రూప్–1 పోస్టులను అంగట్లో పెట్టి అమ్ముకుంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంలో మంత్రులు, సీఎం కార్యాలయంపై వస్తున్న ఆరోపణలను నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి, తమ విలువైన సమయాన్ని, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వెచ్చించి పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని గురువారం ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్–1 పరీక్షను అక్రమాలకు తావులేకుండా తాజా నోటిఫికేషన్ వేసి మళ్లీ నిర్వహించాలన్నారు. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు అమ్ముకున్న దొంగలెవరో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్–1 పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతో పాటు ఆ పార్టీ నేతల కాసుల కక్కుర్తి వల్లే గ్రూప్–1 పరీక్షలో అవకతవకలు చోటు చేసుకున్నాయని అన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందన్నారు. ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్దానాలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించాలని, కేవలం మాటలతో కాకుండా చేతల్లో చూపించి యువత ఆశలను నెరవేర్చాలని కేటీఆర్ సూచించారు.
కేటీఆర్‌కు ‘గ్రీన్ లీడర్‌షిప్’అవార్డు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో చేసిన కృషికిగాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025’కు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. సెపె్టంబర్ 24న న్యూయార్క్‌లో జరగనున్న 9వ ఎన్‌వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది.
నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రూప్–1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని అన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షలను సక్రమంగా నిర్వహించలేక విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది.
డైవర్షన్ రాజకీయాలతో గ్రూప్–1 పరీక్షలో అవినీతి, అవకతవకలను కప్పిపుచ్చాలనే ప్రభుత్వ ఆటలు సాగవు. గ్రూప్–1 పరీక్షలో జరిగిన అక్రమాలపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను రెచ్చగొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అసమర్థతను ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలను నీరుగార్చి, వారి భవిష్యత్తుతో ఆటలాడుతోందని ఆయన విమర్శించారు.
గ్రూప్–1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి
బీఆర్‌ఎస్‌వీ నేతల డిమాండ్
చిక్కడపల్లి (హైదరాబాద్): గ్రూప్–1 పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగబాలు డిమాండ్ చేశారు. గురువారం చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం ముందు గ్రూప్–1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులతో కలసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దీంతో నిరసనలో పాల్గొన్న వారిని చిక్కడపల్లి పోలీసులు అరెస్టుచేసి అబిడ్స్, ముషీరాబాద్ పోలీసుస్టేషన్లకు తరలించారు.
గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ గ్రూప్–1 పరీక్షల్లో జరిగిన అవకతవకలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలుగు మీడియం విద్యార్థులకు పేపర్ వాల్యుయేషన్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేయాలని, తప్పుచేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తుంగబాలు మాట్లాడుతూ గ్రూప్–1 పరీక్షను నిర్వహించడంలో విఫలమైనందున, నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.