హైదరాబాద్‌లో ఘనంగా ఖాల్సా సాజ‍్నా దివస్ | Grand Celebration of Khalsa Sajna Divas in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఘనంగా ఖాల్సా సాజ‍్నా దివస్

Apr 14 2026 3:37 PM | Updated on Apr 14 2026 4:05 PM

Grand Celebration of Khalsa Sajna Divas in Hyderabad

హైదరాబాద్‌: ఖాల్సా పంథ్ స్థాపనకు గుర్తుగా జరుపుకునే “వైశాఖి” పండుగను తెలంగాణ సిక్కు సమాజం మంగళవారం భక్తి, శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించింది. అమీర్‌పేట్‌లోని గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య కార్యక్రమాలను అమీర్‌పేట్‌లోని శ్రీ గురు గోబింద్ సింగ్ జీ క్రీడా మైదానంలో నిర్వహించారు. 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది సిక్కు భక్తులు, ఇతర మతాల ప్రజలు “విశాల్ దీవాన్” (మహా సభ)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రాగీ జథాలు, కథాకారులు గురుబాణీ కీర్తనలు, ధార్మిక ఉపన్యాసాలు ఇచ్చారు.

వారు గురు గ్రంథ్ సాహిబ్ బోధనలు, ఖాల్సా పంథ్ స్థాపన విశిష్టత, జీవన విలువల ప్రాముఖ్యతపై వివరించారు. జాతీయ ఐక్యత, సౌభ్రాతృత్వం, సామరస్యాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాయ్ ఎస్.గురుదేవ్ సింగ్ (ఆస్ట్రేలియా), జ్ఞాని గగన్‌దీప్ సింగ్ జీ (పట్నా సాహిబ్), భాయ్ ఎస్. మన్ప్రీత్ సింగ్ జీ (ఢిల్లీ), భాయ్ వీర్ సింగ్ (హైదరాబాద్‌) తదితర ప్రముఖులు గురుబాణీ కీర్తనలు, కథలు వినిపించారు.

గురుద్వారా సాహెబ్ అమీర్‌పేట్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఎస్.దర్శన్ సింగ్, ప్రధాన కార్యదర్శి ఎస్. సురేందర్ సింగ్ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులను ఆహ్వానించారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ సంప్రదాయ “గురు కా లంగర్” (ఉచిత భోజనం) వడ్డించారు.

రంగురంగుల నగర్ కీర్తన్ నిర్వహణ
సాయంత్రం గురుద్వారా సాహెబ్ అమీర్‌పేట్ నుంచి భారీగా నగర్ కీర్తన్ (పవిత్ర ఊరేగింపు) ఉంటుంది. ఈ ఊరేగింపు గ్రీన్‌లాండ్స్, బేగంపేట్, పంజాగుట్ట ప్రధాన మార్గాల మీదుగా తిరిగి గురుద్వారాకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా శ్రీ గురు గ్రంథ్ సాహిబ్‌ను అలంకరించిన వాహనంలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకెళ్తారు. నిశాన్ సాహిబ్ పతాకదారులు ముందుండగా, యువత గట్కా (సిక్కు యోధ కళ) ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. కీర్తన బృందాలు శబ్ద కీర్తనలు ఆలపిస్తారు.
  
బుధవారం (ఏప్రిల్ 15) రాత్రి 9 గంటల నుంచి ఉదయం 1.30 గంటల వరకు అమీర్‌పేట్‌లోని గురు గోబింద్ సింగ్ జీ క్రీడా మైదానంలో “వైశాఖి రేన్ సబాయ్ కీర్తన్ దర్బార్” నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రాగీ జథాలు శబ్ద కీర్తనలు ఆలపించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement