
గ్రామస్థాయి వరకు రెవెన్యూ సేవలు... ఐదువేల మంది జీపీవోల నియామకం
నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని గ్రామపాలనాధికారుల (జీపీవో) నియామకం ద్వా రా నిలబెట్టుకున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. భూసమస్యలపై తెలం గాణ ప్రజలకు ముఖ్యంగా రైతులకు మరింత మెరు గైన సేవలందించడానికి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా గ్రా మస్థాయిలో జీపీవో సేవలను ఒకటి రెండు రోజు ల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించారు.
సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జీపీవోలకు హైటెక్స్‌లో నియామక పత్రాలను అందజేస్తామన్నారు. గురువారం సచివాలయంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. జీపీవోలుగా విధులు నిర్వర్తించడానికి ఆసక్తి చూపిన వీఆర్వో, వీఆర్‌ఏలకు రెండు విడతల్లో నిర్వహించిన రాత పరీక్షల్లో 5,106 మంది ఎంపికయ్యారని తెలిపారు. సీఎం ఆలోచనకు అనుగుణంగా గ్రామస్థాయి వరకు రెవెన్యూ సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామ పరిపాలనాధికారులను నియమిస్తున్నట్టు తెలిపారు.
భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూసమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. సర్వే విభాగాన్ని కూడా బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. మొదటి విడతలో 7వేల మందికి లైసెన్స్‌డ్ సర్వేయర్ శిక్షణ ఇవ్వడంతోపాటు అర్హత పరీక్ష నిర్వహించామన్నారు. గత నెల 18వ తేదీ నుంచి రెండో విడతలో మూడు వేల మందికి 21 జిల్లాల్లో శిక్షణ ప్రారంభించినట్టు మంత్రి వివరించారు.