రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
జీవవైవిధ్యం, ప్రాచీన వారసత్వ సంపదకు అద్దంపట్టే 64 ప్రదేశాల గుర్తింపు
తొలుత అనంతగిరి, కనకగిరి, నందిపేట, మన్ననూరులలో కాటేజీల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రకృతి, స్థానిక సంస్కృతి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అడ్వెంచర్, రిక్రియేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ వైల్డ్‌లైఫ్, హెరిటేజ్ కల్చర్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని 17 సర్క్యూట్లలో 64 ఎకో టూరిజం ప్రదేశాలను గుర్తించి వాటి అభివృద్ధికి చర్యలు చేపట్టనుంది. తద్వారా పర్యాటక ప్రాంతాల అభివృద్ధితోపాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే జీవవైవిధ్య ప్రాంతాలు, ప్రాచీన వారసత్వ సంపదకు అద్దంపట్టే ప్రదేశాలను గుర్తించింది. మొదట అనంతగిరి, కనకగిరి, నందిపేట, మన్ననూరు పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించనుంది. ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వా మ్యంతో ఎకో టూరిజం ప్రాజెక్టులను సర్కారు అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా అనంతగిరిలో 8, మన్ననూరులో 14 కాటేజీలను నిర్మించనుంది. ఒక్కో ఎకో కాటేజీ నిర్మాణానికి రూ. 20 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఎకో కాటేజీల నిర్మాణంతోపాటు ట్రెక్కింగ్ పార్క్, సఫారీ ట్రాక్, వాచ్ టవర్లను ఏర్పాటు చేయనున్నారు.
మన్ననూరులో ఇప్పటికే 130 మంది గైడ్‌లకు ఎకో టూరి జం హాస్పిటాలిటీపై శిక్షణ ఇచ్చారు. త్వరలోనే నిజామాబాద్‌జిల్లా నందిపేటలోని ఉమ్మెడ, గాజపల్లి, బిల స్పూర్‌లలో ఎకో టూరిజం పనులు ప్రారంభం కానున్నాయి. అలాగే వరంగల్ జూ పార్కును వర్చువల్ రియాలిటీ పార్కుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.


