విషాదం: ఆడుకుంటూ.. అనంతలోకాలకు

Girls Deceased While Playing Karimnagar - Sakshi

వేర్వేరు ఘటనల్లో నివారం ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గోధూర్‌ కోళ్ల ఫారంలో మక్కల బస్తాలు మీద పడి ఒకరు, కోనరావుపేట మండలంలోని హన్మాజీపేటల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందారు. ఈ ముగ్గురూ ఆడుకుంటూనే అనంతలోకాలకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు.

సాక్షి,కోనరావుపేట(వేములవాడ): ఇంట్లో ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి విద్యుదాఘాతంతో మృతిచెందింది. స్థానికుల కథనం ప్రకారం.. వేములవాడ మండలం హన్మాజీపేటకు చెందిన గొర్రె అనిత–సంజీవ్‌ దంపతులు తమ  కూతురు వాంగ్మయి(2)తో కలిసి మండలంమరిమడ్ల(అహ్మద్‌ హుస్సేన్‌పల్లి)లోని బంధువులు ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయం వాటర్‌ హీటర్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి, ఉన్నా చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ముట్టుకోవడంతో విద్యుత్‌ షాక్‌ తగిలింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన పాపను జిల్లా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో బాధిత కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

మరో ఘటనలో..
మక్కల బస్తాలు మీద పడి..
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): జగిత్యాల జిల్లా గోధూర్‌ గ్రామంలోని రాజరాజేశ్వర కోళ్లఫారంలో మక్కల బస్తాలు మీదపడి నందిని(4) మృతి చెందింది. ఏఎస్సై రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన సంగీత–భీంరావు దంపతులు తమ కూతురు నందినితో కలిసి ఉపాధి కోసం పది రోజుల కిందట గోధూర్‌ వచ్చారు. స్థానిక రాజరాజేశ్వర కోళ్లఫారంలో కూలీలుగా పనికి కుదిరారు.

శనివారం తల్లిదండ్రులు పనిలో నిమగ్నం కాగా కోళ్లఫారానికి సంబంధించిన గోదాములో నందినితోపాటు మరికొంత మంది కూలీల పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో మక్కల బస్తాలు నందినిపై పడ్డాయి. పిల్లలు అరవడంతో కూలీలందరూ అక్కడికి చేరుకున్నారు. బస్తాలు తీసి చూడగా ఆ చిన్నారి తలకు తీవ్ర గాయాలై, స్పృహ కోల్పోయింది. వెంటనే మెట్‌పల్లి  ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. కోళ్ల ఫారం యజమాని మిట్టపెల్లి మహేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు.  

చదవండి: మాటిమాటికీ సెల్‌ఫోన్, బైక్‌ అడిగేవాడు.. కాదనడంతో క్షణికావేశంలో..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top