నిజాం నియామకాలు కాదుగా! 

GHMC Should Respect Supreme Court Judgement Says High Court Of Telangana - Sakshi

చట్టాలను, సుప్రీం తీర్పులను జీహెచ్‌ఎంసీ గౌరవించాలి 

క్రమబద్ధీకరణకు ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపలేరు 

జీహెచ్‌ఎంసీ అప్పీల్‌పై హైకోర్టు... విచారణ 29కి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో పనిచేస్తున్న శానిటరీ, ఎంటమాలజీ ఉద్యోగులనేమీ నిజాం రాజు నియమించలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీహెచ్‌ఎంసీ లాంటి ప్రభుత్వ సంస్థలు చట్టాలను, సుప్రీంకోర్టు తీర్పులను గౌరవించాలని, వాటికి అనుగుణంగానే నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌/కాంట్రాక్టు ఉద్యోగులను వేతనాల విషయంలో దోపిడీకి గురి చేయడాన్ని అనుమతించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపించి వారిని క్రమబద్దీకరించడం కుదరదనడం సరికాదని పేర్కొంది.

జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు పద్ధతిలో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న శానిటేషన్, ఎంటమాలజీ సిబ్బందిని క్రమబద్దీకరించాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన అప్పీల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిల ధర్మాసనం గురువారం విచారించింది. ప్రస్తు త కాంట్రాక్టు సిబ్బందిని తొలగించడానికి వీల్లేదని, అరియర్స్‌ ఇప్పుడే ఇవ్వకపోయినా, ఇతర ఉద్యోగులతో సమానంగా పనికి సమా న వేతనం ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. కాంట్రాక్టు ఉద్యోగులు కొనసాగుతున్నవి మంజూరైన పోస్టులా కాదా? వారు ఎంతకాలం నుంచి విధుల్లో కొనసాగుతున్నారు? ఏ సర్వీసు నిబంధన ఆధారంగా వారిని నియమించారు? తదితర వివరాలను సమర్పించాలని జీహెచ్‌ఎంసీని ధర్మాసనం ఆదేశించింది. కాగా,  వాదనల అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top