
వానల్లోనూ అధికార యంత్రాంగాల అశ్రద్ధ
సాక్షి, హైదరాబాద్: నగరంలో గత నాలుగు రోజులుగా వానలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరికలున్నాయి. ఈ నేపథ్యంలో కోటిమందికి పైగా ప్రజలకు సేవలందించాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు ఐక్యంగా సమన్వయంతో ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలతో పనులు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వర్షంలో ఎక్కడ ఏ గుంత ఉందో, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక, తప్పనిసరి ప్రయాణాలు చేయాల్సిన వారు వణికిపోతున్నారు.
తమవైపు నుంచి చేయాల్సిన పనులు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ (GHMC) ఇంజినీర్లు చెబుతున్నారు. తాము హైడ్రాకు సహకరిస్తున్నప్పటికీ, వారి నుంచి ఉండాల్సిన స్పందన ఉండటం లేదని ఆరోపించారు. హైడ్రా అధికారులకు నగరంలో వాటర్ లాగింగ్ పాయింట్లు ఎక్కడ ఉన్నాయో, అక్కడి నుంచి వాన నీరు ఏ నాలాలోకి వెళ్తుందో వారికి ఎన్నో పర్యాయాలు తెలియజేశామన్నారు. నగరంలో ప్రస్తుతమున్న 141 వాటర్‌లాగింగ్ ప్రాంతాల వివరాలు తెలిపామని చెప్పారు.
గత శనివారం జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు కూడా హైడ్రా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారని, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జోనల్ కమిషనర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్ల సమావేశంలో సైతం హైడ్రా అధికారులు తగిన విధంగా స్పందించాల్సిందిగా కోరినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలతో పాటు క్యాచ్‌పిట్ల వద్ద, ఫుట్‌పాత్‌ల పక్కన పేరుకుపోయే సిల్ట్‌ను తొలగించాల్సి ఉండగా, ఆ పనులు జరగడం లేదని కొందరు ఈఈలు ఆరోపించారు. సిల్ట్ తొలగించకపోవడంతో క్యాచ్‌పిట్లలోకి నీరు వెళ్లక రోడ్లు చెరువులయ్యే ప్రమాదం ఉందన్నారు. వర్షం వెలిసిన సమయాల్లో ఈ పనులు చేయాల్సి ఉన్నప్పటికీ, అవి జరగడం లేదని ఆరోపించారు.
హైడ్రా చేయాల్సిన పనులు
జూన్ 9వ తేదీన జారీ అయిన మెమో ప్రకారం హైడ్రా (HYDRAA) ఏమేం పనులు చేయాలో స్పష్టంగా తెలిపారని, ఆ మేరకు మాన్సూన్ ఎమర్జెన్సీ పనుల్లో భాగంగా దిగువ పనులు చేయాల్సి ఉందని జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు పేర్కొన్నారు.
u క్యాచ్‌పిట్ల మూతలపై పేరుకుపోయిన చెత్తాచెదారాలు తొలగించాలి.
u అవసరాన్ని బట్టి ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు చేపట్టాలి.
u నాలా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి.
u వర్షాలు వెలిశాక నాలాల్లో పూడికతీత పనులు చేయాలి.
u రోడ్లపై ఉండే పూడిక తొలగించాలి.
u వరదనీరు నాలాల్లోకి సాఫీగా వెళ్లేందుకు ఏవైనా ఆటంకాలుంటే తొలగించాలి.
u రోడ్లపై పడే విద్యుత్‌స్తంభాలు, చెట్టకొమ్మలు తొలగించాలి.
గతంలో వానాకాలంలో అత్యవసర పనులు చేసేందుకు జీహెచ్‌ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ (ఎంఈటీ)ను నియమించేది. వాటికి సంబంధించి అక్రమాలకు తెరలేపారని గుర్తించిన ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ఈ సంవత్సరం పిలిచిన టెండర్లను రద్దు చేయడంతో పాటు, వానాకాల సమస్యల పరిష్కార బాధ్యతల్ని హైడ్రాకు బదలాయించింది. హైడ్రాతో సమన్వయంతో పనిచేయాలని, తగిన సహకారం అందించాలని జీహెచ్‌ఎంసీతోపాటు ఇతరత్రా విభాగాలకు కూడా సూచించినట్లు సమాచారం.