జీఐ జర్నల్‌లో తాండూరు కంది ప్రత్యేకతలు 

Geographical Identity Of Tandoor Kandi Taste Aroma And Good Nutrients - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ నుంచి భౌగోళిక గుర్తింపు (జీఐ) సాధించిన వికారాబాద్‌ జిల్లా తాండూరు కందికి సంబంధించిన ప్రత్యేకతలను తాజాగా కేంద్రం ‘జీఐ జర్నల్‌’లో పొందుపరిచింది. వండిన పప్పు ఎక్కువకాలం నిల్వ ఉండటం, తొందరగా ఉడకడం, మంచి రుచి, వాసన తాండూరు కంది ప్రత్యేకతలని పేర్కొంది. అలాగే సానుకూల వాతావరణ పరిస్థితులు, రైతులు ఆచరించే సంప్రదాయ, ఆధునిక యాజమాన్య సాగు పద్ధతుల మూలంగా దీనికి ప్రత్యేక గుర్తింపు లభించిందని వివరించింది.

తాండూరు ప్రాంతంలో ఉన్న సున్నపురాయి నిక్షేపాల వల్ల వచ్చే పోషక నాణ్యతలే దీనికి కారణమని వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్‌ మండలాలలో 1.48 లక్షల ఎకరాల్లో కంది సాగు జరుగుతుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు కోసం వివిధ రంగాల నుంచి వెయ్యి దరఖాస్తులు రాగా వాటిలో 432 ఉత్పత్తులకు మాత్రమే భౌగోళిక గుర్తింపు లభించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. 

తెలంగాణ ఏర్పడ్డాక ఆరింటికి.. 
తెలంగాణ ప్రాంతానికి చెందిన మొత్తం 16 ఉత్పత్తులకు ఇప్పటివరకు జీఐ హోదా లభించగా వాటిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆరు ఉత్పత్తులు ఈ ఘనత సాధించాయి. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ హోదా పొందిన వాటిలో పుట్టపాక తేలియ రుమాలు (2015), బంగినపల్లి మామిడి (2017), ఆదిలాబాద్‌ ఢోక్రా, వరంగల్‌ డురీస్‌ (2018), నిర్మల్‌ పెయింటింగ్‌ (2019), తాండూరు కంది (2022) ఉన్నాయి.

తాజాగా తాండూరు కంది భౌగోళిక గుర్తింపు సాధించిన నేపథ్యంలో ఆ ప్రాంత రైతులు, వ్యవసాయ విద్యాలయం సంచాలకుడు డాక్టర్‌ జగదీశ్వర్, కంది పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ సుధాకర్‌లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభినందించారు. ఈ నెల 31న కంది పరిశోధనా కేంద్రంలో తాండూరు రైతులు, శాస్త్రవేత్తలను అభినందిస్తామని ఆయన పేర్కొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top