సీపీఎస్ ఉద్యోగులకు ‘ప్రాన్‌’ భయం | Funds Deducted from CPS Employees PRAN Accounts | Sakshi
Sakshi News home page

సీపీఎస్ ఉద్యోగులకు ‘ప్రాన్‌’ భయం

Apr 7 2026 5:19 AM | Updated on Apr 7 2026 5:19 AM

Funds Deducted from CPS Employees PRAN Accounts

ఇరాన్‌–ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలతో ఉద్యోగుల ‘ప్రాన్‌’ఖాతాల్లో భారీ కోత 

ఒక్కో ఉద్యోగి ఖాతా నుంచి సగటున 7 శాతం మేర తగ్గుదల

మార్చి 14వ తేదీన లాంగ్వేజ్‌ పండిట్‌ ధరమ్‌సింగ్‌ ప్రాన్‌ ఖాతాలో రూ.18,88,500 ఉండగా, మార్చి 31వ తేదీ నాటికి రూ.18,17,933కు పడిపోయింది. కేవలం రెండు వారాల వ్యవధిలో ఆయన ఖాతాలో రూ.70,567 తగ్గింది.

కల్వల్‌ శ్రీకాంత్‌ ఖాతాలో మార్చి 18వ తేదీన రూ.20,93,640 ఉండగా, మార్చి 31వతేదీ నాటికి రూ. 20,51,936 ఉంది. కేవలం 12రోజుల వ్యవధిలో రూ.41,704 కోత పడింది.

సాక్షి, హైదరాబాద్‌: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) పరిధిలోని ఉద్యోగుల ప్రాన్‌ ఖాతాల్లో సొమ్ము ఆవిరవుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధంతో స్టాక్‌ మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకుల ఫలితంగా వారి పెన్షన్‌ ఖాతా సొమ్ము క్రమంగా పతనమవుతోంది. ఒక్కో ఉద్యోగి ప్రాన్‌ (పీఆర్‌ఏఎన్‌–పర్మనెంట్‌ రిటైర్మెంట్‌ అకౌంట్‌ నంబర్‌) ఖాతా నుంచి సగటున 4 నుంచి 7 శాతం మేర పతనం కావడం ఇప్పుడు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్‌ ప్రభుత్వం నేరుగా ఇవ్వకుండా, ప్రత్యేక సంస్థ పరిధిలో నిర్వహిస్తుంది.

ఉద్యోగి, ప్రభుత్వం ఇచ్చే వాటాను సదరు సంస్థలు మార్కెట్‌లో పెట్టుబడులు పెడతాయి. ప్రస్తుతం యుద్ధ వాతావరణంతో దాదాపు నెలరోజులుగా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒక్కసారిగా మార్కెట్‌ పతనం అవుతున్నా..తిరిగి సాధారణ స్థితికి చేరుకునే అవకాశాలు ఏ మాత్రం కనిపించకపోవడంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. వాస్తవానికి ప్రాన్‌ ఖాతాల్లో ఉండే సొమ్మును ఉద్యోగులు ఉద్యోగ విరమణ సమయంలో విత్‌డ్రా చేసుకుంటారు. అయితే తాము జమ చేసుకుంటున్న సొమ్ము రిటైర్‌మెంట్‌కు ముందే భారీగా కరిగిపోతుండడంతో అయోమయానికి గురవుతుండగా..ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగి భవిష్యత్‌ను స్టాక్‌ మార్కెట్లో పెడతారా?
సీపీఎస్‌ విధానంలో ఉద్యోగి భవిష్యత్‌ అత్యంత ప్రమాదకరంగా మారింది. తాజా పరిస్థితులు మరింత స్పష్టం చేస్తున్నాయి. ఎక్క డో యుద్దం జరుగుతుంటే..ఇక్కడ సీపీఎస్‌ ఉద్యోగి ప్రాన్‌ ఖాతా లో నిధులు ఆవిరవుతున్నాయి. ఉద్యోగి సొంతంగా అందులో పెట్టుబడి పెడితే నష్టాన్ని భరిస్తాడు. కానీ యుద్ధం ఎక్కడ జరుగుతుంది.. పెట్టుబడి ఎవరు పెడుతున్నారు.. ఎవరు నష్టపోతున్నారు ? ప్రభుత్వం ఆలోచించాలి. సీపీఎస్‌ కింద ఉద్యోగి వాటా 10%తో పాటు ప్రభుత్వం చెల్లిస్తున్న 10% వాటా కూడా ప్రజలు చెల్లించిన పన్నుల రూపంలో వచి్చన ప్రజా ధనమే. ఇంతటి భారీ మొత్తాన్ని కార్పొరేట్‌ కంపెనీల లాభనష్టాల మీద ఆధారపడేలా చేయడం ప్రజలను, ఉద్యోగులను వంచించడమే. ప్రభుత్వోద్యోగుల పెన్షన్‌పై కార్పొరేట్‌ పెత్తనం సాగనివ్వొద్దు. తక్షణమే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తేనే ఉద్యోగి ప్రశాంతంగా జీవిస్తాడు.
     – స్థితప్రజ్ఞ, తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు (టీఎస్‌సీపీఎస్‌ఈయూ)

ఉద్యోగుల బతుకులు నిత్యం టెన్షన్‌లోనే
పెన్షన్‌ అనేది ఉద్యోగికి అవసరాల కోసమే కాదు... ఉద్యోగి కుటుంబ సభ్యుల భవిష్యత్‌కు సంబంధించినది కూడా. దానిని స్టాక్‌ మార్కెట్‌తో ముడిపెట్టడంతో ఉద్యోగి బతుకులు నిత్యం టెన్షన్‌తోనే గడుస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేస్తానని చెప్పింది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి. మార్కెట్‌ ఒడిదుడుకుల వల్ల మా పిల్లల భవిష్యత్, మా వృద్ధాప్య భద్రతను బలి చేయొద్దు. – కల్వల్‌ శ్రీకాంత్, టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement