RRR: ప్రాణాలైనా ఇస్తాం.. భూములు ఇవ్వం.. రీజనల్‌ రింగ్‌ రోడ్డు సర్వేలో తీవ్ర ఉద్రిక్తత

Farmers Prevent Officials For Conducting Land Survey For Regional Ring Road - Sakshi

యాదాద్రి జిల్లా రాయగిరిలో పోలీసు బందోబస్తు మధ్య సర్వే 

అడ్డుకున్న రైతులు.. అధికారులతో వాగ్వాదం, తోపులాట 

రైతులను అరెస్టు చేసిన పోలీసులు 

సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో రీజనల్‌ రింగ్‌ రోడ్డు కోసం గురువారం చేపట్టిన సర్వేను రైతులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రి క్తత ఏర్పడింది. ‘మా ప్రాణాలైనా ఇస్తాం కానీ, భూములను ఇవ్వబోము’అంటూ రైతులు నినాదాలు చేశారు. సర్వేకు ఒప్పుకోమని అధికారులకు తేల్చిచెప్పారు. దీంతో అధికారులు పెద్ద ఎత్తున పో లీసు బలగాలను దించి ఎక్కడికక్కడ మహిళలు, యువకులు, వృద్ధులను అదుపులోకి తీసుకుని వి విధ పోలీసు స్టేషన్‌లకు తరలించారు.

ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. వారికి సంఘీభావం తెలపడానికి వచ్చిన వివిధ పార్టీల నాయకులను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య మొత్తానికి అధికారులు రాత్రి వరకు సర్వేను పూర్తి చేశారు.  

రోడ్డుపై బైఠాయించిన రైతులు
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా సర్వే ఎలా చేస్తారని రైతులు సర్వే సిబ్బందిని అడ్డుకుని రహదారిపై బైఠాయించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహిళలు, పిల్లలు, రైతులు రోడ్డుపైనే కూర్చున్నారు. దీంతో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు.

అయితే, రైతులు ఒక్కసారిగా వె ళ్లి సర్వే పనులను అడ్డుకుని అధికారుల చేతుల్లోని యంత్రాలను లాక్కుని పరుగులు తీశారు. ఈ క్ర మంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్‌ ఎక్కిస్తుండగా మహిళా రైతులు అడ్డుకున్నా రు. ఈ సమయంలో ఓ మహిళా రైతు చేతికి గాయమైంది. మరో మహిళ కాలుకు తీవ్ర గాయం కావడంతో ఇతర మహిళలు ఆందోళన ఉధృతం చేశా రు.  మహిళా పోలీసులు వచ్చి వారిని బీబీనగర్, భువనగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు.  

ఓవైపు ఆందోళన.. మరో వైపు సర్వే 
రాయగిరి వద్ద రీజనల్‌ రింగ్‌ రోడ్డు కోసం సేకరించే భూముల సర్వేకు కలెక్టరేట్‌ నుంచి ఎనిమిది బృందాలు వచ్చాయి. సర్వే నిలిపివేయాలని రైతులు ఒకవైపు ఆందోళన చేస్తుండగానే.. అధికారులు భూ సర్వే పనులు కొనసాగించారు. గత కొన్ని రోజుల నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ సర్వేను రాయగిరి రైతులు అడ్డుకుంటున్నారు. అయితే ఈ ప్రాంతంలో కేవలం భువనగిరి మున్సిపాలిటీ, కొన్ని గ్రామాల్లో మాత్రమే సర్వే మిగిలింది.

దీంతో గురువారం రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుతో వచ్చారు. భువనగిరి మండలం రాయగిరి, ముత్తిరెడ్డిగూడెం, గంగసానిపల్లి గ్రామాల మధ్య సర్వే పనులు పూర్తయినట్లు యాదాద్రి జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి చెప్పారు. రైతులు కొంతమేరకు ప్రతిఘటించారని, అయినప్పటికీ సర్వే పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు.  

 32 మందిని అరెస్టు చేశాం.. 
రీజనల్‌ రింగ్‌ రోడ్డు సర్వే పనులను అడ్డుకున్నందుకు నలుగురు మహిళలతో కలిపి మొత్తం 32 మందిని అరెస్ట్‌ చేశాం. తర్వాత అందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రం విడుదల చేశాం.      
– వెంకట్‌రెడ్డి, ఏసీపీ, భువనగిరి  

ఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలి?  
నాకున్న మూడు ఎకరాల భూమి రోడ్డులో పోతే నా ముగ్గురు ఆడ పిల్లలను ఎలా పెంచాలి. పెళ్లిళ్లు ఎలా చేయాలి? తలుచుకుంటేనే భయమేస్తుంది. ఒక బిడ్డకు ఒక ఎకరం చొప్పున అమ్మి పెళ్లి చేయాలి అని అనుకున్నాం. కానీ, ప్రభుత్వం భూమి మొత్తం తీసుకుంటోంది. 
– పద్మ, రాయగిరి  

బతకడమే వ్యర్థం  
నా భర్త చనిపోగా ఆయన వారసత్వంగా నాకు ఏడు ఎకరాల భూమి వచ్చింది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. నా ఆరోగ్యం కూడా బాగుండటంలేదు. ఒక్క గుంట భూమి కూడా లేకుండా పోతుంది అంటే గుండె ఆగిపోయినట్లు ఉంది. బతకడమే వ్యర్థం అనిపిస్తోంది.  
–– లక్ష్మి, రాయగిరి   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top