లారీతో తొక్కించేశారు!

Farmer murdered in Rampur after try to stop Illegal Sand Mining - Sakshi

రాజాపూర్‌లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రైతు హత్య

పాలమూరు జిల్లాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా

అక్రమార్కులకు ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలు?

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/ రాజాపూర్‌: 
మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తమ పొలాల మీదుగా ఇసుక వాహనాలు నడపొద్దన్న పాపానికి ఓ పేద రైతును ఇసుకాసురులు లారీ టైర్ల కింద తొక్కించి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన రాజాపూర్‌ మండలం తిర్మలాపూర్‌లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తిర్మలాపూర్‌కు చెందిన గుర్రంకాడి నర్సింలు(38)కు గ్రామశివారులో ఎకరం పొలం ఉంది. దాని పక్కనే దుందుభి వాగు ఉంది. ఇసుక మాఫియా అక్కడ ఇసుకను తీసి ఫిల్టర్‌ చేసి టిప్పర్లు, లారీల ద్వారా రైతుల పొలాల మీదుగా హైదరాబాద్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్‌ ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోజూ పది ట్రిప్పుల ఇసుక తరలుతోంది.

ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు పడిపోయి సాగుకు నీరందని పరిస్థితి నెలకొనడంతో పరిసర పొలాల రైతులు గతంలో ఎన్నోమార్లు ఇసుక వాహనాలను అడ్డుకున్నారు. అధికారులకు సైతం ఎన్నోమార్లు íఫిర్యాదు చేసినా అక్రమరవాణాకు అడ్డుకట్ట పడలేదు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తన పొలం మీదుగా వెళ్తున్న టిప్పర్‌ను నర్సింలు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇసుక అక్రమార్కులు అదే వాహనం టైర్ల కింద నర్సింలును తొక్కించేసి హత్య చేశారు. హత్యపై భగ్గుమన్న మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నర్సింలు చావుకు కారణమైనవారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సంఘటనాస్థలాన్ని డీఎస్పీ శ్రీధర్‌ పరిశీలించారు. హంతకులను చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

రంగంలో అధికార పార్టీ నాయకుడు?
నర్సింలు హత్యపై కోపోద్రిక్తులైన గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు పావులు కదపడం చర్చనీయాంశంగా మారింది. సంఘటనాస్థలానికి చేరుకున్న సదరు నాయకుడు మృతుడి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కేసు కాకుండా చూసేందుకు యత్నిస్తున్నాడంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మూడేళ్లుగా వ్యవసాయ బోర్లు ఎండిపోతున్నాయని మండిపడిన గ్రామస్తులు ఇసుక రవాణా వద్దని వారించిన తమపై మాఫియా అనేకసార్లు దౌర్జన్యం చేసిందని భగ్గుమన్నారు. అదే గ్రామానికి చెందిన తో నేత అండదండలు ఇసుక మాఫియాకు పుష్కలంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఇసుక లారీ యజమానులు మృతుడి కుటుంబానికి రూ.20 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. మరోవైపు ఉన్నతాధికారుల అండదండలతోనే ఇసుక మాఫియా బరితెగిస్తోందనే ఆరోపణలున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top