పోడుపై కీలక భేటీ.. కేసీఆర్‌ నిర్ణయాలపై ఉత్కంఠ

Excitement Over CM KCR Decision On Podu Lands - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ ఏటూరునాగారం /ములుగు:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములు, అటవీ సంరక్షణ, హరితహారం వంటి అంశాలపై ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందా అన్న దానిపై అటవీశాఖ ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. శనివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరగనున్న ముఖ్యమైన సమావేశంలో పోడు ఆక్రమణలను క్రమబద్ధీకరించే దిశలో ప్రభుత్వం నిర్ణయిస్తుందా లేదా అన్న చర్చ సాగుతోంది. ఈ సమీక్షా సమావేశంలో పోడు భూములపై ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొననున్నారు.

అటవీ శాఖతో పాటు పలు ఇతర శాఖల ఉన్నతాధి కారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. 2005 తర్వాత మళ్లీ పోడు భూముల పేరిట అటవీ ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తే జరిగే నష్టంపై పర్యా వరణ నిపుణుల వాదనలు, ఇతర అంశాలు పరిగణ నలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చ ని, అటవీశాఖకు సంబంధించిన ప్రత్యేక ఆదేశాలతో కార్యాచరణ ప్రణాళికలు ప్రకటించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఏరియల్‌ సర్వే
పోడు భూముల సాగు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు శుక్రవారం ములుగు జిల్లా ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో అధికారులు హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వే చేపట్టారు. ఫొటోలు తీయడంతో పాటు వీడియో చిత్రీకరణ చేసినట్లు సమాచారం. ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన భూముల వివరాలు, పోడు భూముల దరఖాస్తులపై ప్రభుత్వం ఇప్పటికే సమాచారాన్ని తెప్పించుకుంది. పోడు భూముల సర్వే పూర్తయ్యే వరకు హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 

పోడు భూములపై ఆరా
ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్‌ జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓలు, అటవీశాఖ డీఎఫ్‌ఓలు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారులతో.. పోడు భూముల కమిటీ సభ్యులు శాంతికుమారి, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. అటవీ ప్రాంతాల్లో ఏయే తెగలు నివాసం ఉంటున్నాయో ఆరా తీశారు. నాలుగు జిల్లాల్లో పోడు భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top