
ఏఐఎన్‌యూ రోబో-ల్యాప్ సదస్సులో వైద్య నిపుణుల వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా ఇదే తరహా పరిణామం
యూరలాజికల్ లాప్రోస్కొపీ, రోబోటిక్స్ సర్జరీలపై విస్తృత చర్చ
దేశంలోని పలు రాష్ట్రాలు, విదేశాల నుంచి వెయ్యి మంది హాజరు
హైదరాబాద్: యూరాలజీ విభాగంలో చేసే శస్త్రచికిత్సల్లో రోబోల యుగం వచ్చేసిందని, అమెరికా లాంటి దేశాల్లో అయితే అది తప్పనిసరి కూడా అయ్యిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా అందరూ తమకు వీలైనంత చిన్న కోతలతో సర్జరీలు కావాలని అడుగుతున్నారని, ముఖ్యంగా రోబోటిక్ శస్త్రచికిత్సల వల్ల తమకు ఇబ్బంది తక్కువనే భావన అందరిలోనూ వచ్చిందని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెప్పారు. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన రోబో-ల్యాప్ 2025 సదస్సులో పలువురు విదేశీ వైద్య నిపుణులు ఈ తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు.
యూరలాజికల్ చికిత్సల విషయంలో రోబోటిక్, లాప్రోస్కొపిక్ చికిత్సలలో వస్తున్న సరికొత్త టెక్నాలజీలపై చర్చించేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలతో పాటు ఇంగ్లండ్, అమెరికా, బెల్జియం, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాంటి దేశాల నుంచి కలిపి మొత్తం వెయ్యి మందికి పైగా యూరాలజిస్టులు ఇందులో పాల్గొన్నారు. సంక్లిష్టమైన యూరాలజీ కేసులు, వాటికి చికిత్సలు ఎలా అందించాలన్న విషయమై నిపుణులు ఇందులో విస్తృతంగా చర్చించారు. శస్త్రచికిత్సలలో పాటించాల్సిన విధానాలు, భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం కావడం, ఈ స్పెషాలిటీలో రోగులకు అత్యుత్తమ చికిత్సలు అందించడంపై ఏఐఎన్‌యూ నిర్వహించిన ఈ సదస్సు ఉత్సాహవంతంగా సాగింది. రెండు రోజుల పాటు సాగిన ఈ సదస్సులో పలు వర్క్ షాప్‌లు, సంక్లిష్టమైన కేసుల గురించిన చర్చలు, భవిష్యత్తు టెక్నాలజీలు యూరాలజీ, నెఫ్రాలజీ చికిత్సలను ఎలా మారుస్తాయన్న అంశంపై అత్యున్నత స్థాయి సమీక్షలు జరిగాయి.

ఈ సదస్సు గురించి ఏఐఎన్‌యూ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి. మల్లికార్జున మాట్లాడుతూ, “రోగులకు చికిత్స అందించే విషయంలో అత్యాధునిక వైద్య పరిజ్ఞానాన్ని అమలుచేయాలని ఏఐఎన్‌యూ ఎప్పుడూ భావిస్తుంది. రోబో-ల్యాప్ 2025 సదస్సు కేవలం శస్త్రచికిత్సల్లో వస్తున్న కొత్త మార్పులు ప్రదర్శించడానికి కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులంతా ఒక్క వేదికమీదకు చేరి, వారి ఆలోచనలు పంచుకుని యూరాలజీ చికిత్సల భవిష్యత్తును సమిష్టిగా పునర్నిర్వచించాలన్నదే మా ఉద్దేశం. ఈ స్థాయి సదస్సుల నిర్వహణ ద్వారా యూరాలజీ రంగంలో రోబోటిక్, మినిమల్లీ ఇన్వేజివ్ చికిత్సల్లో సరికొత్త విజయాల గురించి అందరికీ తెలుస్తుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా అందరూ తమకు వీలైనంత చిన్న కోతలతో సర్జరీలు కావాలని అడుగుతున్నారు. దానివల్ల నొప్పి తక్కువ ఉండడం, త్వరగా కోలుకుని తమ పనులు చేసుకోవడం సాధ్యమవుతుందని వారికి తెలుసు. కానీ, అలాంటి శస్త్రచికిత్సలు, ముఖ్యంగా యూరాలజీ విభాగంలో వైద్య కళాశాలల్లో ఇంతకుముందు నేర్పలేదు. అందువల్ల ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారు వీటిపై తమ విజ్ఞానాన్ని పెంచుకుని తమ స్వదేశాలకు లేదా సొంత రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రోగులకు సంతృప్తికరమైన చికిత్స అందించడానికి ఈ సదస్సు వారికి ఎంతగానో ఉపయోగపడింది. దీనికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, గల్ఫ్ దేశాలు.. ఇలా పలు దేశాల నుంచి వైద్యులు వచ్చి రోబోటిక్, ల్యాప్రోస్కొపిక్ శస్త్రచికిత్సలు చేయడం, వాటిలో ఉండే టెక్నిక్‌లు, నైపుణ్యాల గురించి వివరంగా నేర్చుకున్నారు. మన దేశంతో పాటు విదేశాల్లో కూడా యూరాలజీ చికిత్సలను మరింత మెరుగుపరచాలన్న ఏఐఎన్‌యూ నిబద్ధతకు ఈ సదస్సు నిదర్శనం. ఇది లాప్రోస్కొపిక్, రోబోటిక్ యూరాలజీ శస్త్రచికిత్సలకు ఒక కరదీపికలా ఉపయోగపడుతుంది” అని చెప్పారు.
ఏఐఎన్‌యూ సీఈఓ సందీప్ గూడూరు మాట్లాడుతూ, “యూరాలజీ రంగంలో అత్యున్నత స్థాయి చికిత్సలు, నిరంతర అధ్యయనం, సాంకేతిక ఆవిష్కరణల దిశగా ఏఐఎన్‌యూ నిబద్ధతను రోబో-ల్యాప్ సదస్సు ప్రతిబింబిస్తుంది. ఆవిష్కరణలకు హద్దులు ఉండకూడదని ఏఐఎన్‌యూ భావిస్తుంది. రోబో-ల్యాప్ సదస్సు ఈ స్ఫూర్తికి నిదర్శనం” అన్నారు.
అధిక నాణ్యత కలిగిన యూరో-ఆంకాలజీ శస్త్రచికిత్సలు, రీకన్‌స్ట్రక్టివ్ శస్త్రచికిత్సలు, సంక్లిష్మైన పిల్లల శస్త్రచికిత్సలలో వస్తున్న మార్పులపై అత్యంత అవసరమైన విజ్ఞాన పంపిణీ వేదికగా ఈ సదస్సు నిలిచింది. సమస్యాత్మక కేసులకు శస్త్రచికిత్సా పరిష్కారాలు, రోబోటిక్, లాప్రోస్కొపిక్ శస్త్రచికిత్సలు కచ్చితత్వాన్ని ఎలా సాధిస్తున్నాయి, కోతలను ఎలా తగ్గిస్తున్నాయి, రోగులు త్వరగా ఎలా కోలుకుంటున్నారు అన్న విషయాలపై ప్రముఖ వైద్య నిపుణులు సమగ్రంగా వివరించారు.