అలా వాడిన వారిపై కఠిన చర్యలు తప్పవు
సిటీ సివిల్ కోర్టు జడ్జి ఆదేశాలు
చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్‌లోని ప్రతివాదులకు నోటీసులు
ఈ నెల 27న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశం
సిటీ కోర్టులు: ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అనుమతి లేకుండా ఇతర వ్యక్తులు లేదా సంస్థలు ఆయన పేరు, ఫొటోలు, స్వరాన్ని (వాయిస్) వాడొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. తన అనుమతి లేకుండా పలువురు వ్యక్తులు, సంస్థలు తన పేరును వాడుతున్నారని, దాని వల్ల తన పరువుకు భంగం కలిగే అవకాశం ఉన్నందున అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో కూడా ఇలాంటివి జరుగకుండా ఆదేశాలు జారీ చెయ్యాలని సిటీ సివిల్ కోర్టులో చిరంజీవి పిటిషన్ దాఖలు చేశారు.
తన పేరు/చిత్రం/ప్రసిద్ధ సినీ శీర్షికలను అనుమతి లేకుండా వాడుకోవడం, ఆ¯న్‌లైన్ ప్లాట్‌ఫాంలపై వినియోగించడం, కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా మార్పులు చేసిన తన చిత్రాలు, వీడియోలను ప్రచారం చేయడం ఆపేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు.. వ్యక్తులు లేదా ఏ సంస్థలైనా చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్ తదితర వాటిని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించరాదని శనివారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు.
ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా చిరంజీవి పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్న పలువురికి కోర్టు నోటీసులు జారీచేస్తూ అక్టోబర్ 27న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఏ రూపంలోనైనా, ఏ మాధ్యమంలోనైనా, వ్యక్తిగత లేదా వాణిజ్య లాభం కోసం నేరుగా గానీ పరోక్షంగా గానీ చిరంజీవి పేరును ఉపయోగించొద్దని స్పష్టంచేసింది. చిరంజీవి వ్యక్తిత్వ/ప్రచార హక్కుల ఉల్లంఘనలు గాని పరువు నష్టం చర్యలుగాని జరిగితే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
టెలివిజన్ చానళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫాంలు, మీడియా సంస్థలు తదితర అన్నిరకాల వ్యక్తులు/సంస్థలు లాభాలను పొందే ఉద్దేశంతో చిరంజీవి పేరు, చిత్రం, వాయిస్ లేదా ఇతర వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగించడం, తప్పుగా చూపించడం లేదా వక్రీకరించడం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.


