Disha Case: ‘నేనొకటి చెబితే.. సజ్జనార్‌ మరొలా చెప్పారు’

Disha Case: Shamshabad DCP Statement To Justice Sirpurkar Commission Integrate - Sakshi

 ‘దిశ’ స్కూటీ టైర్‌లో గాలి తీసింది నవీన్‌ అని నేను చెప్పలేదు 

నిందితుల డీఎన్‌ఏ సేకరణ, దిశ వస్తువుల రికవరీ జరిగిందని కూడా చెప్పలేదు 

కానీ, ప్రెస్‌మీట్‌లో సజ్జనారే అన్ని వివరాలు వెల్లడించారు 

జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ముందు శంషాబాద్‌ డీసీపీ వాంగ్మూలం 

సాక్షి, హైదరాబాద్‌: ‘దిశ’కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ బుధవారం శంషాబాద్‌ డీసీపీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డిని విచారించింది. ఈ ఎన్‌కౌంటర్‌ సమయంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను కమిషన్‌ విచారించిన సందర్భంగా చాలా ప్రశ్నలకు ఆయన ‘శంషాబాద్‌ డీసీపీ బ్రీఫింగ్‌ చేసేవారు.. దాన్ని బట్టే మీడియాకు వివరాలను వెల్లడించాను’ అని అని చెప్పిన నేపథ్యంలో కమిషన్‌ తరుఫున న్యాయ వాది ఎం.విరూపాక్ష దత్తాత్రేయ గౌడ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిపై పలు ప్రశ్నలను సంధించారు. 

విచారణలోని కీలకాంశాలివే..  
‘దిశ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) మహ్మద్‌ ఆరిఫ్‌ ఒప్పుకోలు విచారణ (కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌) 2019 నవంబర్‌ 29న సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమై 6:45 గంటలకు ముగిసింది. ఏ2– జొల్లు శివ ఒప్పుకోలు విచారణ 6:45 గంటలకు ప్రారంభించి ఎన్ని గంటలకు ముగించారో రికార్డ్‌ చేయలేదు. ఆరిఫ్‌ వాంగ్మూలం పూర్తికాకుండానే గంట ముందే అప్పటి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌కు నిందితులు నేరం చేసిన తీరును ఎలా చెప్పగలిగారు’అని డీసీపీని జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ప్రశ్నించింది. సాయంత్రం 5:15 గంటలకు నిందితుల అరెస్టు గురించి మాత్రమే ఏసీపీ సురేందర్‌ తనకి చెప్పారని.. అదే విషయాన్ని సీపీ సజ్జనార్‌కు వివరించానని.. త్రిసభ్య కమిటీకి డీసీపీ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. 

2019 డిసెంబర్‌ 6వ తేదీ నాటికి దిశ సెల్‌ఫోన్, పవర్‌ బ్యాంక్‌ల రివకరీ, నిందితుల డీఎన్‌ఏ సేకరణ జరగలేదని తెలిపారు. కానీ, అదే రోజు రాత్రి 7:15 గంటలకు శంషాబాద్‌ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాత్రం సీపీ సజ్జనార్‌ రికవరీ, డీఎన్‌ఏ సేకరణ జరిగినట్లు తప్పుగా తెలిపారని వివరించారు. నిందితులు మరణించాకే వారి మృతదేహాల నుంచి డీఎన్‌ఏ శాంపిల్స్‌ను సేకరించామని పేర్కొన్నారు.

పోలీస్‌ ఆఫీసర్ల చేతిలోని తుపాకులు అన్‌లాక్‌ చేసి ఉన్నాయని మీరే చెప్పారా అని కమిషన్‌ ప్రశ్నించగా.. షాద్‌నగర్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ తనకు ఆ విషయం చెప్పారని.. అదే విషయాన్ని సీపీకి తెలియజేశానని సమాధానం ఇచ్చారు. 2019 డిసెంబర్‌ 6వ తేదీన సజ్జనార్‌ రెండోసారి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఇచ్చిన ప్రజెంటేషన్, నేరం జరిగిన తీరు కేవలం తన బ్రీఫింగ్‌ మీద ఆధారపడి నిర్వహించలేదని త్రిసభ్య కమిటీకి డీసీపీ తెలిపారు. 

గాలి తీసింది నవీన్‌ అని చెప్పలేదు.. 
‘దిశ’స్కూటీ టైర్‌లో గాలి తీసింది జొల్లు నవీన్‌ అని తాను చెప్పలేదని సిర్పుర్కర్‌ కమిషన్‌కు శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. 2019 నవంబర్‌ 29న రాత్రి 7:15 గంటలకు శంషాబాద్‌ డీసీపీ ఆఫీసులో ప్రెస్‌మీట్‌ నిర్వహించే సమయానికి జొల్లు నవీన్‌ ఒప్పుకోలు విచారణ జరగలేదు.. కానీ, ఆ ప్రెస్‌మీట్‌లో సీపీ సజ్జనార్‌.. నవీనే స్కూటీలో గాలి తీశాడని ఎలా చెప్పారని కమిషన్‌ ప్రశ్నించింది. దీంతో తాను ఆ విషయాన్ని కమిషనర్‌కు చెప్పలేదని.. నలుగురు నిందితులు కలిసే దిశ స్కూటీని పంక్చర్‌ చేసే పథకం రచించారని మాత్రమే చెప్పానని డీసీపీ వెల్లడించారు. 

మళ్లీ మేజిస్ట్రేట్‌ అనుమతి అవసరం లేదనిపించింది.. 
‘నిందితుల కస్టడీ కోసం జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ అనుమతి అత్యవసరమని ఏసీపీకి మీరు చెప్పలేదా?’అని కమిషన్‌ ప్రశ్నించగా.. ‘2019 నవంబర్‌ 30న రిమాండ్‌ కోసం షాద్‌నగర్‌ ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచాం కదా.. అందుకే కస్టడీ కోసం మళ్లీ జ్యుడీషయల్‌ మేజిస్ట్రేట్‌ అనుమతి అవసరం లేదని షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ నాతో చెప్పారు. దాంతో నాకూ ఆ అవసరం లేదనిపించింది’అని డీసీపీ ప్రకాశ్‌రెడ్డి సిర్పుర్కర్‌ కమిషన్‌కు వివరించారు. ఎగ్జిక్యూటివ్‌ మెజి్రస్టేట్, జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌.. ఇద్దరి ఆఫీసు లు ఒకటే దగ్గర ఉండటంతో నాకూ అనవసరమే అనిపించింది.. అని పేర్కొన్నారు. 

దీంతో జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లా అండ్‌ ఆర్డర్‌లో డీసీపీ హోదాలో ఉంటూ, శంషాబాద్‌ వంటి కీలకమైన ప్రాంతానికి ఉన్నతాధికారి అయి ఉండి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో క్రిమినల్‌ ప్రొసిజర్స్‌ కోడ్స్‌ను సరిగా అనుసరించాలని తెలియదా’అని మండిపడ్డారు. పైగా నిందితులను కస్టడీకి తీసుకునేముందు భౌతికంగా జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చడం, నిందితుల ఆరోగ్య పరిస్థితులు, ఇతరత్రా వివరాలను కుటుంబ సభ్యులకు తెలపాలని కూడా తెలియకపోతే ఎలా అని మందలించారు. కొన్ని ప్రశ్నలకు చాలా లోతైన సమాధానాలు చెబుతున్న మీరు.. కొన్ని కీలకమైన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top