
జిల్లాల్లో చేర్పులు, మార్పులకు డిసెంబర్ 31 డెడ్‌లైన్
ప్రస్తుతం ఉన్నవాటిని యథాతథంగా కొనసాగించటమా?
ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే జిల్లా పరిధిలోకి వచ్చేలా చేయడమా?
ప్రస్తుతం పలు నియోజకవర్గాలు మూడు జిల్లాల్లో ఉన్న వైనం
జిల్లాల విభజనపై విన్పిస్తున్న భిన్న వాదనలు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి.. మార్పులు లేకపోతే ప్రస్తుత జిల్లాల ఆధారంగానే జనాభా లెక్కలు, పునర్విభజన
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఓ వైపు ముంచుకొస్తున్న జనాభా లెక్కల ప్రారంభ గడువు.. అది పూర్తి కాగానే శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన.. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న జిల్లాల భౌగోళిక సరిహద్దుల్లో చేర్పులు మార్పులు చర్చనీయాంశమవుతున్నాయి. మార్పులు, చేర్పులు అవసరమైతే ఈ ఏడాది డిసెంబర్ 31లోగా మొత్తం ప్రక్రియను ముగించాలంటూ కేంద్ర ప్రభుత్వం గడువు పెట్టగా..దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రంలో 2016 – 19లలో ఏర్పాటైన కొత్త జిల్లాల కూర్పుపై భిన్నవాదనలు వినిపిస్తుండటంతో ప్రస్తుతం ఉన్నవాటిని యథాతథంగా కొనసాగించటమా? లేక ఒక శాసనసభ నియోజకవర్గం ఒకే జిల్లా పరిధిలోకి వచ్చే విధంగా మార్పులు చేర్పులు చేయటమా? అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, ఇప్పటివరకు ఏమీ తేల్చలేకపోతోంది.
ఒక వేళ జిల్లాలను యథాతథంగా ఉంచి జనాభా లెక్కలకు వెళితే.. వచ్చే నియోజకవర్గాల పునర్విభజనను కూడా ప్రస్తుత జిల్లా యూనిట్‌గానే చేయాల్సి ఉంటుంది. అయితే నేల స్వభావాలు, పర్యావరణం, పంటలు, ఉమ్మడి సంస్కృతి, భాష, యాస, అన్నింటికంటే ముఖ్యంగా ఏకరీతి మానసిక స్థితి.సామాజిక శక్తుల పొందికతో పాటు జీవన శైలి, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, కట్టుబొట్టు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాల ఏర్పాటు చేయాల్సి ఉన్నా..గతంలో కొన్నిచోట్ల వాటిని పాటించలేదన్న అసంతృప్తి ఉంది.
ఒక్కప్పుడు రాజధానిగా వెలిగిన వరంగల్‌ను కూడా అశాస్త్రీయంగా విభజించారని చెబుతూ..ఉమ్మడి వరంగల్ కింద ఉన్న జిల్లాలన్నిటినీ మళ్లీ ఒక్కటి చేయాలన్న డిమాండ్‌తో ఇటీవల ఏర్పడిన జేఏసీ ఉద్యమ కార్యాచరణకు పిలుపునివ్వడం గమనార్హం.
సౌలభ్యం కోసమే అయినా..
కొత్త జిల్లాల ఏర్పాటు.. వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలనను మెరుగుపరచడం, పరిపాలనా సౌలభ్యాన్ని పెంచడం కోసమే జరిగినా, ప్రస్తుతం రాష్ట్రంలో పలు శాసనసభ నియోజకవర్గాలు మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఏ జిల్లా యంత్రాంగానికి పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉండటం లేదు.
ఉదాహరణకు పాలకుర్తి నియోజకవర్గం మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాల పరిధిలో ఉండగా, హుస్నాబాద్ నియోజకవర్గం సిద్దిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల పరిధిలో ఉంది. ఇల్లందు నియోజకవర్గం ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. గిరిజన జనాభా అధికంగా ఉన్న ఖానాపూర్ నియోజకవర్గం సైతం మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో వ్యాపించి ఉంది.
తుంగతుర్తి నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఉంది. అలాగే చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాలు సైతం మూడేసి జిల్లాల్లో ఉన్నాయి. దీంతో సమాంతర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సమీక్షలకు పలు అడ్డంకులు ఏర్పడుతున్నాయని ఎంపీలు, ఎమ్మెల్యేలు అంటున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో ఉన్న ప్రభుత్వం, జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఎలాంటి నిర్ణయానికీ రాలేకపోతోంది.
ఇదీ జిల్లాల ఏర్పాటు చరిత్ర
కుతుబ్‌షాహీలు మొదలుకుని ఆసఫ్ జాహీల వరకు పరిపాలనా సౌలభ్యం కోసం సర్కార్‌లు, సుభాలుగా కొనసాగిన ప్రాంతాలను 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన సమయంలోనే.. హైదరాబాద్ స్టేట్‌లో తెలుగు మాట్లాడే ప్రాంతాలను తెలంగాణలో, మరాఠి మాట్లాడే వారిని బొంబాయి రాష్ట్రంలో, కన్నడ మాట్లాడే వారిని సమీప కన్నడ జిల్లాల్లో విలీనం చేశారు. దశాబ్దాల పాటు తెలంగాణలో 9 జిల్లాలు కొనసాగగా 1978లో కొత్తగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటైంది. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం 2016లో కొత్తగా మరో 21 జిల్లాలు, 2019లో మరో 2 జిల్లాలు ఏర్పాటు చేయటంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య మొత్తం 33కు చేరింది.
1956 తొలి పునర్విభజన – జిల్లాలు ఇలా:
హైదరాబాద్
ప్రస్తుతం ఉన్న ప్రాంతాలతో పాటు గుల్బర్గా (ప్రస్తుత కర్ణాటకలో) నుండి తాండూరు, మెదక్‌లోని వికారాబాద్, మహబూబ్‌నగర్‌లోని పరిగి ప్రాంతాలను కలిపి హైదరాబాద్ జిల్లాను పునర్‌వ్యవస్థీకరించారు. 2016 విభజనలో హైదరాబాద్ జిల్లాను యథావిధిగా ఉంచారు.
మహబూబ్‌నగర్
పది తాలూకాలతో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు అదనంగా రాయచూర్ (ప్రస్తుత కర్ణాటక) నుండి గద్వాల, ఆలంపూర్, గుల్బర్గా నుండి కొడంగల్ ప్రాంతాలను కలిప్పారు. ఇందులో ఉన్న పరిగిని హైదరాబాద్‌లో కలిపారు. 2016–2019 విభజనలో కొత్తగా నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలు ఏర్పాటు చేశారు. షాద్‌నగర్, అమనగల్ తదితర మండలాలను రంగారెడ్డి జిల్లాలో విలీనం చేశారు.
నల్లగొండ
కుతుబ్‌షాహీల నుండి ఒకే జిల్లాగా కొనసాగిన ఈ జిల్లాలో 1956లోనూ పెద్దగా మార్పులు చేయలేదు.నల్లగొండ,, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ, రామన్నపేట, హుజూర్‌నగర్ తాలూకాలతో కొనసాగింది. అయితే 2016లో కొత్తగా యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలను ఏర్పాటు చేశారు.
మెదక్
మెదక్ సుభాగా వందల ఏళ్లు కొనసాగిన ఈ జిల్లాలో సంగారెడ్డి, మెదక్, ఆందోలు, వికారాబాద్, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్ తాలూకాలుండేవి. 1956 పునర్విభజనలో వికారాబాద్‌ను హైదరాబాద్‌లో కలిపి, గుల్బర్గాలో ఉన్న జహీరాబాద్, నారాయణఖేడ్‌లను మెదక్ జిల్లాలో చేర్చారు. 2016లో కొత్తగా సిద్దిపేట, మెదక్ జిల్లాలను ఏర్పాటు చేశారు.
కరీంనగర్
సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఎలగందల్ జిల్లా ఆపై కరీంనగర్‌గా మారిపోయింది. 1956లో ఈ జిల్లా సిరిసిల్ల, మెట్‌పల్లి, జగిత్యాల, సుల్తానాబాద్, మహదేవ్‌పూర్, హుజూరాబాద్ తాలూకాలతో కొనసాగింది. 2016లో కొత్తగా పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలను ఏర్పాటు చేశారు.
వరంగల్
వరంగల్ సుభాగా కాకతీయుల రాజధానికిగా ఉన్న వరంగల్‌లో 1956 నాటికి, పాకాల, ములుగు, మహబూబాబాద్, పరకాల తాలూకాలుండగా, 1952 అనంతరం జనగామ తాలూకాను వరంగల్ జిల్లాకు మార్చారు. 1953కు ముందు ఖమ్మం జిల్లా మొత్తం వరంగల్‌లో ఉండేది. 2016–19లలో కొత్తగా హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలను ఏర్పాటు చేశారు.
ఖమ్మం
1953 అక్టోబర్ ఒకటిన ఏర్పాటైన ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మధిర, ఇల్లందు, బూర్గుంపహాడు, పాల్వంచ తాలూకాలుండగా, 1959లో భద్రచాలం సబ్ డివిజన్ గ్రామాలను తూర్పుగోదావరి నుండి ఖమ్మం జిల్లాకు మార్చారు. 2016లో కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేశారు.
నిజామాబాద్
చాలా కాలం పరిపాలన కేంద్రంగా ఉన్న ఈ జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్ తాలూకాలుండేవి. 1956 పునర్విభజనలో బొంబాయి రాష్ట్రంలోని నాందేడ్ జిల్లాలో తెలుగు మాట్లాడే బిచ్కుంద, మద్నూర్, జుక్కల్‌లను నిజామాబాద్ జిల్లాలో విలీనం చేశారు. 2016 తర్వాత కామారెడ్డి జిల్లా ఏర్పాటయ్యింది.
ఆదిలాబాద్
ఆదిలాబాద్, ఉట్నూరు, ఖానాపూర్, నిర్మల్, బో«థ్, చెన్నూరు, సిర్పూరు, లక్సెట్టిపేట, ఆసిఫాబాద్ తాలూకాలతో పాటు పాటు ఇదే జిల్లాలో భాగంగా కొనసాగిన కిన్వత్, రాజూరా తాలూకాలతో ఈ జిల్లా కొనసాగింది. కానీ 1956లో మరాఠి మాట్లాడే వారు అధికంగా ఉన్న కిన్వత్, రాజూరాలను బొంబాయిలో కలిపారు. నాందేడ్ నుండి ముధోల్‌ను ఆదిలాబాద్‌లో కలిపారు. 2016లో కొత్తగా మంచిర్యాల, కుమ్రుం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలను ఏర్పాటు చేశారు.
రంగారెడ్డి
1978 ఆగస్టు 15న ఏర్పాటైన హైదరాబాద్ రూరల్ జిల్లాను అదే సంవత్సరం అక్టోబర్‌లో కేవీ రంగారెడ్డి జిల్లాగా మార్చారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడైన కొండా వెంకట రంగారెడ్డి పేరు మీద ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. 2106లో మహబూబ్‌నగర్ నుండి షాద్‌నగర్, ఆమనగల్ తదితర ప్రాంతాలను అదనంగా రంగారెడ్డి జిల్లాలో చేర్చి, కొత్తగా మేడ్చల్–మల్కాజిగిరితో పాటు వికారాబాద్ కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేసి మహబూబ్‌నగర్ నుండి కొడంగల్‌ను కొత్తగా విలీనం చేశారు.
అశాస్త్రీయంగా 33 జిల్లాలు చేశారు
కేవలం కుటుంబ ఆధిపత్య పాలనను స్థిరీకరించడానికి రాష్ట్రాన్ని ఆశాస్త్రీయంగా 33 జిల్లాలు చేసి రాజకీయ చైతన్యాన్ని, అభివృద్ధిని అడ్డుకునే కుట్ర చేశారు. అందులో భాగంగానే వరంగల్ జిల్లాను ముక్కలు చేశారు. మహానగరాన్ని ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్ద అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలి. గత శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ జిల్లాలను శాస్త్రబద్ధంగా పునర్వ్యవస్థీకరణ చేస్తామంది. సీఎం రేవంత్‌రెడ్డి మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం ఉంది.
– ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ, తెలంగాణ ఉద్యమ కారుల వేదిక, వరంగల్
చిన్న జిల్లాలతో సుపరిపాలనకు చాన్స్
నేను అతిపెద్ద అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశా. ఎంత పెద్దవంటే నా బదిలీ అయ్యే లోపు కొన్ని ప్రాంతాల్లో పర్యటించలేకపోయా. చిన్న జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేయొచ్చు. సివిల్ సర్వీస్ అధికారుల నిరంతర పర్యవేక్షణకు అవకాశం ఉంటుంది. నేరుగా లబ్దిదారులతోనే టచ్‌లో ఉండే అవకాశం ఉంటుంది. చిన్న జిల్లాలో వ్యయం అధికమైనా.. మంచి పాలనకు చాన్స్ ఉంటుంది.
– డాక్టర్.బి.జనార్ధన్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్
లోక్‌సభ యూనిట్‌గా పునర్విభజన చేయాలి
తెలంగాణాలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగింది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని, కొత్త జిల్లాల ఏర్పాటు కోసం విషయ నిపుణులతో కమిటీ వేసి, వారిచ్చే నివేదిక మేరకు విభజన చేయాల్సి ఉండగా అవేవీ జరగలేదు. ఇప్పుడైనా లోక్‌సభ యూనిట్‌గా జిల్లాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల విషయంలో మినహాయింపు తీసుకోవచ్చు.
– ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి