ఇంటర్‌ అడ్మిషన్లు పాత పద్ధతిలోనే.. | Decision on merging Inter Board with school education postponed | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ అడ్మిషన్లు పాత పద్ధతిలోనే..

May 11 2026 4:46 AM | Updated on May 11 2026 4:46 AM

Decision on merging Inter Board with school education postponed

పాఠశాల విద్యలో ఇంటర్‌బోర్డు విలీనంపై నిర్ణయం వాయిదా 

సమయం లేకపోవడం.. సంస్కరణలకు మరింత సమయం అవసరం

దీంతో ఈ ఏడాది పాత పద్ధతిలోనే అడ్మిషన్లు చేపట్టాలని సీఎం నిర్ణయం 

పాఠశాల విద్యాశాఖ అధికారుల సమీక్షలో రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు 2026–27 విద్యా సంవత్సరానికి పాత పద్ధతిలోనే చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉందని, ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండటంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి సీబీఎస్‌ఈలో తరహాలో 11, 12 తరగతులను పాఠశాల విద్యలోనే కొనసాగించాలని, ఫలితంగా డ్రాపౌవుట్స్‌ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలంగాణ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో అత్యధికులు ఆ తర్వాత ఇంటర్మీడియట్‌కు వేరుగా ఉన్న కళాశాలల్లో చేరడం లేదు. అక్కడితోనే చదుకు ఆపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ను వేరుగా కాకుండా 11, 12 తరగతులుగా కొనసాగించాలని ముఖ్యమంత్రి గతంలో అధికారులకు సూచించారు. ఇదే అంశాన్ని తెలంగాణ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ కూడా తన నివేదికలో పేర్కొంది. 

ఇటీవల ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో సీఎం, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి వి.వి.శేషాద్రి, సీఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్‌ రాజ్, విద్యాశాఖ కమిషనర్‌ యోగితా రాణాలతో ఆదివారం సమీక్షించారు. ఇంటర్మీడియట్‌ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడంతో ముడిపడిన పలు సాంకేతిక సమస్యలను క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. విలీన ప్రక్రియకు సంబంధించి భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్‌ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. అనంతరం శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం తాజా ఆదేశాలతో అతి త్వరలో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్‌ బోర్డు విడుదల చేసే అవకాశం ఉంది.    

Advertisement
 
Advertisement
Advertisement