హైదరాబాద్‌ కంపెనీలకు ‘హిండెన్‌బర్గ్‌ బూచి’.. అవకతవకలు జరిగాయంటూ బెదిరింపులు!

Cyber Crime In The name Of Hindenburg Report To HYD Auditing Companies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘హిండెన్‌బర్గ్‌–అదానీ గ్రూప్‌’ ఎపిసోడ్‌ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ఇటీవల సైబర్‌ నేరగాళ్లు ఈ తరహా కార్పొరేట్‌ బెదిరింపులకు దిగుతున్నారు. బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన ఓ సంస్థ శుక్రవారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ సంస్థకు రూ.వేల కోట్ల టర్నోవర్, దేశ వ్యాప్తంగా క్లయింట్స్‌ ఉన్నారు. దీని అధికారిక ఐడీకి ఈ నెల మొదటి వారంలో ఓ ఈ–మెయిల్‌ వచ్చింది.

అమెరికాకు చెందిన ప్రముఖ ఆడిట్‌ కంపెనీ పంపినట్లు అందులో ఉంది. అందులో అనేక అవకతవకలకు పాల్పడుతూ, రికార్డులను తారుమారు చేయడంతోనే మీ సంస్థకు ఇంత మొత్తం టర్నోవర్‌ ఉన్నట్లు తమకు తెలిసిందని బెదిరించారు. ఈ విషయం తాము సుదీర్ఘ పరిశోధన తర్వాత గుర్తించామని రాశారు. కొన్ని సందేహాలు తీర్చుకోవడానికి కంపెనీ నిర్వాహకుల వివరాలతో పాటు ఫైనాన్స్‌ స్టేట్‌మెంట్స్‌ తమకు పంపాలని మెయిల్‌లో కోరారు.

ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే తక్షణం తమకు 75 వేల డాలర్లు బిట్‌ కాయిన్స్‌ రూపంలో బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. తమ సంస్థకు సంబంధించిన సమస్త సమాచారం పబ్లిక్‌ డొమైన్‌లోనే ఉండటం, ప్రముఖ ఆడిటింగ్‌ కంపెనీగా చెప్తున్న వారికి ఈ విషయం తెలియకపోవడంతో అనుమానించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరో పక్షం రోజుల తర్వాత అదే ఐడీ నుంచి వీరికి మరో ఈ–మెయిల్‌ వచ్చింది.

అందులో డిమాండ్‌ చేసిన మొత్తం లక్ష డాలర్లు పెరిగిపోయింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న నిర్వాహకులు సొంత ఐటీ టీమ్‌తో ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఈ నేపథ్యంలో దాన్ని బెంగళూరుకు చెందిన సైబర్‌ నేరగాళ్లు అమెరికా సర్వర్‌ను వాడి పంపినట్లు తేల్చారు. దీంతో సదరు సంస్థ జనరల్‌ మేనేజర్‌ శుక్రవారం సిటీ సైబర్‌ కైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top