సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడి | CV Anand assumes charge as Director General of Police: Telangana | Sakshi
Sakshi News home page

సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడి

May 2 2026 4:15 AM | Updated on May 2 2026 4:15 AM

CV Anand assumes charge as Director General of Police: Telangana

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై త్వరలో సమీక్షిస్తా..

సోషల్‌ మీడియాలో శ్రుతి మించితే పోలీస్‌ జోక్యం తప్పదు

తెలంగాణ పోలీస్‌ను నంబర్‌వన్‌గా కొనసాగిస్తా

కుటుంబ సభ్యుల సమక్షంలో డీజీపీగా బాధ్యతల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్‌: నేర నియంత్రణ, సాంకేతికత వినియోగంలో దేశంలో నంబర్‌వన్‌గా నిలిచిన తెలంగాణ పోలీస్‌ స్థానాన్ని నంబర్‌వన్‌గా కొనసాగించేందుకు కృషి చేస్తానని డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. శాంతిభద్రతల నిర్వహణ..నేర దర్యాప్తులో సాంకేతికత, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగం మరింత పెంచుతామని చెప్పారు. మత్తు పదార్థాల కట్టడి, సైబర్‌ నేరాల నియంత్రణ, మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. సీవీ ఆనంద్‌ శుక్రవారం లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

తొలుత డీజీపీ కార్యాలయ సిబ్బంది నుంచి గౌరవ వందనం తీసుకున్నారు. డీజీపీ సతీమణి లలితా ఆనంద్, కుమారులు మిలింద్, నిఖిల్, కోడళ్లు ఐశ్వర్య, వాసంతి, మనుమరాలు మిషిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సీవీ ఆనంద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం డీజీపీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి డీజీపీగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

 సైబర్‌ నేరాల కట్టడికి టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, మత్తు పదార్థాల కట్టడికి ప్రత్యేకంగా ఈగల్‌ను ఏర్పాటు చేశామన్నారు. అయితే కేవలం ఈ ప్రత్యేక విభాగాలే కాకుండా జిల్లా ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు సైతం సైబర్‌ నేరాలు, మత్తు పదార్థాల కట్టడిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్‌తోపాటు విద్యాశాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

ట్రాఫిక్‌ నియంత్రణకు ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ బ్యూరో
రోడ్డు ప్రమాదాల్లో మరణాలు, ట్రాఫిక్‌ చిక్కులు తగ్గించేలా, రాష్ట్ర వ్యాప్తంగా ఏకరీతిన ట్రాఫిక్‌ నిబంధనలు అమలు చేసేలా, రోడ్‌ ఇంజినీరింగ్, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై దృష్టి పెట్టేందుకు రాష్ట్ర స్థాయిలో ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ రోడ్‌సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేస్తామని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ప్రకృతి విపత్తులు, భారీ అగ్ని ప్రమాదాలు, వరదల సమయంలో సహాయక చర్యల్లో సమన్వయం పెంచేలా పోలీస్‌శాఖలో శిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు.

గతంలో నక్సల్స్‌ నియంత్రణకు గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ విభాగాలను ఏర్పాటు చేసి కేటాయించిన సిబ్బందిని ప్రస్తుతం అవసరమైన సైబర్, నార్కోటిక్స్‌ విభాగాలకు బదిలీ చేస్తామని, 19 వేల పోలీస్‌ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందులో ఇప్పటికే 5 వేల నియామకాలకు ఆమోదం లభించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన సీసీ కెమెరాల మరమ్మతులకు ప్రత్యేక డ్రైవ్‌ చేపడతామని, దర్యాప్తులో సాంకేతిక లోపాల వల్ల నేరస్తులు తప్పించుకోకుండా ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా డాక్యుమెంటేషన్‌ను పక్కాగా చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో నక్సలిజం దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని, మిగిలి ఉన్నవారు కూడా పునరావాస పాలసీ ప్రకారం జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.

తుది దశలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు తుదిదశలో ఉందని, త్వరలోనే సమీక్షించి దానికి అనుగుణంగా చార్జ్‌ïÙట్‌ వేస్తామని డీజీపీ సీవీ ఆనంద్‌ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. సోషల్‌ మీడియాలో వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూనే, రాజ్యాంగబద్ధమైన భావప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తామన్నారు. చివరగా, తాను ’మెక్రో మేనేజ్‌మెంట్‌’ విధానాన్ని అనుసరిస్తానని, క్షేత్రస్థాయి అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే క్రైమ్‌ మీటింగ్స్‌ ద్వారా వారి పనితీరును పర్యవేక్షిస్తానని చెప్పారు. సమావేశంలో శాంతి భద్రతల డీజీ మహేశ్‌ భగవత్, టీఎస్‌ఎల్పిఆర్బీ చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు, ఎస్పీఎఫ్‌ డీజీ స్వాతి లక్రా, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్, సీఐడీ విభాగ డీజీ చారుసిన్హా, ఐజీలు రమేశ్‌రెడ్డి, రమేశ్‌నాయుడు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement