క్రౌడ్‌ ఫండింగ్‌... సేవా ట్రెండింగ్‌ 

Crowdfunding Help For Expensive Medical Treatments In Telangana - Sakshi

ఆన్‌లైన్‌లో ఆపన్నహస్తం

ఆపన్నులు – దాతలకు మధ్య ఆన్‌లైన్‌ వారధి 

ఖరీదైన చికిత్సలు అవసరమైన అభాగ్యులకు వరం 

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక బాలుడు అరుదైన వ్యాధితో బాధపడ్డాడు. చికిత్సకు రూ.16 కోట్లు అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో అంత డబ్బు ఎలా తేవాలని, ఎవరిని అడగాలని, తమ చిన్నారిని ఎలా బతికించుకోవాలని ఆ తల్లిదండ్రులు ఎంతగానో కలత చెందారు. అప్పుడు వారిని దేవుడిలా ఆదుకుంది ‘క్రౌడ్‌ఫండింగ్‌’. దీంతో ఆన్‌లైన్‌లో సమకూరిన నిధులతో వారు తమ చిన్నారిని బతికించుకున్నారు. ఆ కుటుంబంలో మళ్లీ సంతోషం నింపిన ఆ ‘క్రౌడ్‌ఫండింగ్‌’ అంటే ఏమిటో తెలుసుకుందాం..   

సాక్షి, హైదరాబాద్‌: గతంతో పోలిస్తే.. దాతల సంఖ్య పెరిగింది. ఐటీ సంబంధిత సంస్థల్లో పనిచేసే యువకులు చారిటీ అంటే సై అంటున్నారు. దీంతో ఆపన్నులు–దాతలకు మధ్య వారధిలాంటి మాధ్యమాలు కూడా పెరుగుతున్నాయి. వీటిలో ప్రాచుర్యంలో ఉన్న వారధి ఆన్‌లైన్‌ ఫండ్‌ రైజింగ్‌ పేజెస్‌/ క్రౌడ్‌ ఫండింగ్‌. అన్ని అవసరాలకూ ఇవి ఉపయోగపడుతున్నప్పటికీ.. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు అధికంగా లబ్ధి చేకూరుతోంది. దీంతో ఖరీదైన చికిత్సలు అవసరమైన అభాగ్యులకు ఇవి వరంలా మారాయి. 

వ్యక్తిగతంగా చేస్తే సందేహాలు  
మన వారెవరైనా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ చికిత్సకు అవసరమైన డబ్బు మన దగ్గర లేనప్పుడు ఆన్‌లైన్‌ పేజ్‌లు తయారుచేసుకుని దాతల నుంచి విరాళాలు సేకరించవచ్చు. అలా ఓ రోగి తరపున పేజ్‌ సృష్టించిన వ్యక్తిని క్యాంపెయిన్‌ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తారు. వ్యక్తిగతంగా పేజ్‌ తయారు చేసుకుంటే దాతలు సందేహించొచ్చు  కాబట్టి అప్పటికే ఈ తరహా పేజ్‌లకు సపోర్ట్‌ చేసేందుకు కొన్ని క్రౌడ్‌ ఫండింగ్‌ వేదికలు అవతరించాయి. ఇవి కొంత రుసుము తీసుకుని బాధితుడి తరపున చారిటీ క్యాంపెయిన్‌ నిర్వహిస్తాయి. వాటినే క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లంటారు.  

జాగ్రత్తగా...చేయూత 
చికిత్స కోసం నిజంగా అవసరమైన వారిని మాత్రమే తమ వేదికను వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వడం.. మరోవైపు దాతలిచ్చే విరాళాలు దుర్వినియోగం కాకుండా చూడటం అనే ఈ రెండు బాధ్యతలనూ క్రౌడ్‌ ఫండింగ్‌ వేదికలు నిర్వర్తిస్తాయి. దీని కోసం వీరు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరార్థులకు చెందిన ఆధార్, పాన్‌ తదితర గుర్తింపు కార్డులతోపాటు సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ని కూడా క్షుణ్నంగా తనిఖీ చేస్తారు. క్యాంపెయిన్‌ చేసేవారికీ లబ్ధిదారులతో ఉన్న అనుబంధం, రోగి ఐడీ, వ్యాధి, చికిత్స తాలూకు ధ్రువపత్రాలు, చికిత్సకు అయ్యే అంచనా వ్యయం.. వగైరా వివరాలు కచ్చితంగా సేకరిస్తారు. చికిత్స అందిస్తున్న సంబంధిత ఆసుపత్రి, వైద్యులతో కూడా రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారు. ఈ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో శాఖలు ఉన్నాయి.  

సిటీ ఆస్పత్రులతో ఒప్పందాలు 
మేము హైదరాబాద్‌ నుంచి వివిధ చికిత్సల కోసం 12 వేల క్యాంపెయిన్స్‌ నిర్వహించాం. బాధితులకు రూ.105 కోట్లు అందించాం. పుణెకు చెందిన వేదికా షిండా అనే బాలికకు అవసరమైన జీన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ కోసం సేకరించిన రూ.14.3 కోట్లే ఇప్పటిదాకా సేకరించిన వాటిలో అత్యధిక మొత్తం. ఇందులో 1.34 లక్షల మంది దాతలు పాల్గొన్నారు. రెయిన్‌బో, గ్లోబల్, కిమ్స్‌ తదితర 25 ప్రముఖ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుని పనిచేస్తున్నాం. మా ద్వారా సాయం కోరాలంటే  Milaap.org వెబ్‌సైట్‌ను సందర్శించాలి లేదా  facebook@milaap.orgకు మెయిల్‌ చేయాలి. –అనోజ్‌ విశ్వనాథన్, ప్రెసిడెంట్, మిలాప్‌  

సెకనుకో విరాళం
సెకనుకో విరాళం అనే స్థాయిలో విరాళాలు మా వేదిక ద్వారా అందుతున్నాయి. ఇప్పటిదాకా మేం రూ.1,500 కోట్ల ఫండ్‌ రైజింగ్‌కు తోడ్పడ్డాం. హైదరాబాద్‌ నుంచి కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో రెండువేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి. 150 ఆస్పత్రులతో కలిసి పనిచేశాం. తాజాగా హైదరాబాద్‌కి చెందిన మూడేళ్ల బాలిక ఆయాన్ట్‌ గుప్తాకు అవసరమైన స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోపీ టైప్‌1 చికిత్స కోసం రూ.14.84 కోట్లు సేకరించాం. చికిత్స నిధుల కోసం www.impactguru.com/users/start&fundraiser ను సంప్రదించవచ్చు. –పీయూష్‌ జైన్, సీఈఓ, ఇంపాక్ట్‌గురు.కామ్‌ 

సెలబ్రిటీలూ స్పందించారు.
మా అబ్బాయి ఆయాన్ష్‌కు అయ్యే చికిత్సలో భాగంగా అందించాల్సిన ఒక ఇంజెక్షన్‌ ఖరీదు రూ.16 కోట్లు అని తెలియగానే అంత మొత్తం ఎలా తేవాలో తెలియక ఆందోళన చెందాం. అయితే ఆస్పత్రి సహకారంతోపాటు ఇంపాక్ట్‌ గురు క్రౌడ్‌ ఫండింగ్‌ చేయూతతో ఖరీదైన ఇంజెక్షన్‌ను మా అబ్బాయికి ఇప్పించగలిగాం. దీని కోసం 62,450 మంది దాతలు స్పందించడం మర్చిపోలేని విషయం. వీరిలో సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా ఉన్నారు.  –యోగేష్‌ గుప్తా                       

చదవండి: ఇదిగో మేమున్నాం.. మీకేం కాదు.. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top