పసిపాపను అనాథ చేసి దంపతుల బలవన్మరణం | Couple commits suicide in Chirala | Sakshi
Sakshi News home page

పసిపాపను అనాథ చేసి దంపతుల బలవన్మరణం

Apr 30 2026 7:44 AM | Updated on Apr 30 2026 7:44 AM

Couple commits suicide in Chirala

బెడ్‌రూమ్‌లో భార్య.. బాత్‌రూమ్‌లో భర్త ఉరేసుకుని ఆత్మహత్య 

బాపట్ల జిల్లా రావూరిపేటలో హృదయ విదారక ఘటన 

బాపట్ల జిల్లా: పసిపాప బోసినవ్వులు.. కేరింతలతో అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. పాలబుగ్గల పసిపాప గుక్కపట్టి ఏడుస్తుండగా.. సముదాయించాల్సిన తల్లిదండ్రులు ఈ లోకాన్నే వీడిపోయారు. ఆ భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో ఏమోగానీ ఒకరు బెడ్‌రూమ్‌లో.. మరొకరు బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వారి 13 నెలల పసిపాపను అనాథను చేశారు. ఈ హృదయ విదారక ఘటన బుధవారం బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రావూరిపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆర్యవైశ్య వీధికి చెందిన మాజేటి ప్రభాకర్‌(33)కు చెరుకుపల్లికి చెందిన పార్వతి(24)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 13 నెలల మాని్వత అనే పాప ఉంది.

ప్రభాకర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా ఇంటినుంచే పనిచేస్తున్నాడు. ఈ నెల 5న పాప మొదటి పుట్టిన రోజును ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. బుధవారం ప్రభాకర్‌ తన సోదరుడితో మీసేవ కేంద్రానికి వెళ్లి వచ్చాడు. పార్వతి మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో పక్కింటి వాళ్లకు పాపను అప్పగించి చూడమని చెప్పింది. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ప్రభాకర్‌ సోదరుడు ఇంటికి రాగా తలుపులు తీయలేదు. కిటికీలోంచి చూసేసరికి వదిన పార్వతి బెడ్‌రూమ్‌లో చీరతో ఉరివేసుకోగా.. ప్రభాకర్‌ బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

చీరాల రూరల్‌ సీఐ సుధాకర్, వేటపాలెం ఎస్‌ఐ జనార్దన్‌  ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. క్షణికావేశంలో భార్యాభర్తలు తీసుకున్న నిర్ణయం వారి బిడ్డను అనాథను చేసింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో అనాథగా మారిన పాపను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. దంపతుల ఆత్మహత్యకు కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement