Omicron India: Corona New Variant Omicron Is Expanding Day By Day Around The World - Sakshi
Sakshi News home page

Omicron Variant: థర్డ్‌..ఫోర్త్‌.. ఫిఫ్త్‌ ఇలా ఎన్ని వేవ్‌లు వచ్చినా.. తీసుకోవాల్సిన చర్యలివే..

Dec 8 2021 4:03 AM | Updated on Dec 8 2021 11:44 AM

Corona New Variant Omicron Is Expanding Day By Day Around The World - Sakshi

ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు, మందులు, ఆక్సిజన్‌ సరఫరా...

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ రోజురోజుకూ విస్తరిస్తోంది. మన దేశంలో వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో థర్డ్‌వేవ్‌ వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు ఉన్నాయి. వ్యాక్సిన్లు వేస్తున్నా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలోనే థర్డ్‌..ఫోర్త్‌.. ఫిఫ్త్‌ ఇలా ఎన్ని వేవ్‌లు వచ్చినా ఎదుర్కొనేలా యుద్ధానికి సన్నద్ధం కావా ల్సిందేనని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రాలకు సూచించింది.

ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు, మందులు, ఆక్సిజన్‌ సరఫరా, ఇతర వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని పేర్కొంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేయాలని కోరింది.

రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలు.. 
గ్రామాలు, నగరాల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను మరింత బలోపేతం.
జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో కొత్తగా క్రిటికల్‌ కేర్‌ సంబంధిత పడకల ఏర్పాటు. 
వ్యాధి నిర్ధారణ లేబరేటరీ వ్యవస్థను బలోపేతం చేయడానికి మెట్రోపాలిటన్‌ యూనిట్ల ఏర్పాటు.
ఇప్పటికే ఉన్న వైరల్‌ డయాగ్నోస్టిక్‌ అండ్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ల (వీఆర్‌డీఎల్‌) బలోపేతం. 
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వన్‌ హెల్త్‌ ఏర్పాటు. 
విమానాశ్రయాల వంటి ఇంటర్నేషనల్‌ పాయింట్స్‌ ఆఫ్‌ ఎంట్రీ (పీఓఈ)ల వద్ద పబ్లిక్‌ హెల్త్‌ యూనిట్ల బలోపేతం. తద్వారా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావడం. 
కరోనా నిర్ధారణ పరీక్షల రేట్లు, ఆసుపత్రుల్లో పడకల ధరలపై చేరికల ఆధారంగా పరిమితులు విధించడం. 
ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది, ఇతర మానవ వనరులను సంసిద్ధం చేసుకోవడం. ఇతర వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ కార్మికులు తదితరులకు అవసరమైన శిక్షణ ఇవ్వడం. 
కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ విధుల్లో మెడికల్‌ ఇంటర్న్‌ల సేవలను ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించాలి. 
ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం విద్యార్థులను టెలి–కన్సల్టేషన్, తేలికపాటి కోవిడ్‌ కేసుల పర్యవేక్షణ వంటి సేవలను అందించడానికి ఉపయోగించుకోవచ్చు. 
మెడికల్‌ పీజీ, సూపర్‌ స్పెషాలిటీ ఫైనలియర్‌ విద్యార్థుల సేవలను ఉపయోగించుకోవాలి. 
కొత్త నియామకాలు జరిగే వరకు సీనియర్‌ రెసిడెంట్ల సేవలను వినియోగించుకోవాలి. 
బీఎస్సీ, జీఎన్‌ఎం అర్హత పొందిన నర్సులను పూర్తి సమయం కోవిడ్‌ నర్సింగ్‌ విధుల్లో ఉపయోగించుకోవాలి. 
జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద కాంట్రాక్టు ప్రాతిపదికన వైద్యులు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించుకోవాలి. 
గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో సేవలందించే నిపుణులైన వైద్యులకు భత్యం కోసం అవసరమైన ఆర్థిక సాయం చేయాలి.
ఆక్సిజన్‌ ప్లాంట్ల స్థాపన విషయంలో రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందుతుంది. 
ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ వినియోగ ఆడిట్‌ను చేపట్టాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement