ఎక్కడపడితే అక్కడ పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు

Corona Danger Home Isolation Waste Causing To Spread Virus In Hyderabad - Sakshi

చెత్తలోనే పారవేస్తున్న హోం ఐసోలేషన్‌ వ్యర్థాలు 

తెలియక ముట్టుకుని వైరస్‌ బారిన పారిశుద్ధ్య కార్మికులు 

పాజిటివ్‌ ఏరియాలో కంటైన్మెంట్‌ జోన్లు.. నోటీసు బోర్డులు హుళక్కే 

హోం ఐసోలేషన్‌లో 25 వేల మందికిపైనే  

తాజాగా మూడు జిల్లాల్లో 1404 పాజిటివ్‌ కేసులు 

సాక్షి, సిటీబ్యూరో: హోం ఐసోలేషన్‌లోని కరోనా బాధితుల వ్యర్థాలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. వీటిని ప్రత్యేకంగా సేకరించే వ్యవస్థ లేకపోవడంతో బాధితులు ఎక్కడ పడితే అక్కడ వాటిని వదిలేస్తుండటంతో తెలియక వాటిని తాకిన ఇతరులు వైరస్‌ బారిన పడుతున్నారు. ప్రస్తుతం వ్యాప్తంగా 39,154 పాజిటివ్‌ కేసులు ఉండగా, వీటిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3,487 మంది చికిత్స పొందుతుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 10,214 మంది చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 25,453 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనే ఉన్నారు. వీరు వాడిన పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌజులు సహా కోవిడ్‌ బాధితులు తాకిన ఇతర వస్తువులు.. ఆహార పదార్థాలు సాధారణ వ్యర్థాల్లో కలుపుతున్నారు. ప్రమాదకరమైన ఈ వ్యర్థాలను ఇళ్ల మధ్యే వదిలేస్తున్నారు. వాటిని ముట్టుకోవడంతో పారిశుద్ధ్య కార్మికులు, చెత్త నుంచి ప్లాస్టిక్‌ను వేరు చేసే వారు వైరస్‌ బారిన పడుతున్నారు.

కంటైన్మెంట్‌ జోన్లేవీ?  

  • మొదట్లో అనుమానం ఉంటే చాలు పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యేవారు. పోలీసులు పాజిటివ్‌ కేసు ఉన్న పరిసరాలకు ఇతరుల రాకపోకలను బంద్‌ చేస్తే.. వైద్య సిబ్బంది బాధితులను ఆస్పత్రులకు తరలించేవారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆశాలు, నర్సింగ్‌ స్టాఫ్‌ స్వయంగా ఇంటికి వెళ్లి మందుల కిట్లు అందజేసేవారు.  ఆరోగ్య సమస్యలపై ఆరా తీసేవారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది వెంటనే ఆ ఇంటికి కోవిడ్‌– 19 పేరుతో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఆ ఇంటి పరిసరాలను పూర్తిగా హైడ్రోక్లోరిన్‌ చల్లేవారు.  
  • ప్రస్తుతం ఇవేవీ చేయడంలేదు. బాధితులను ఇంటిì నుంచి బయటికి రావొద్దని సూచిస్తుందే కానీ.. కిట్లు, ఇతర నిత్యావసరాలు సరఫరా చేయడం లేదు. ఫలితంగా రోగులే స్వయంగా వాటిని సమకూర్చుకోవాల్సి వస్తోంది. బాధితులు వినియోగించిన వస్తువులు, తినగా మిగిలిపోయిన ఆహార పదార్థాలు, ఇతర వ్యర్థాలు కవర్‌లో చుట్టి వీధి చివర్లో పడేస్తుండటం, ఈ విషయం తెలియక పారిశుద్ధ్య కారి్మకులు వాటిని ముట్టుకుని వైరస్‌ బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.  

కొత్తగా 1404 కేసులు..  
తాజాగా ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా 4,009 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనే 1,404 కేసులు నమోదయ్యాయి. 14 మంది మృతి చెందగా.. వీరిలో తొమ్మిది మంది నగరవాసులే. పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నప్పటికీ.. సిటీజన్ల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. మాస్‌్కలు లేకుండా, భౌతిక దూరం పాటించడం లేదు. విందులు, వినోదాల పేరుతో  బయట తిరుగుతూ వైరస్‌ బారినపడుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top