
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గురించి మాట్లాడే అర్హత మంత్రి జగదీశ్వర్ రెడ్డికి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. మాజీ ప్రధానిపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద స్పందిస్తూ.. దేశ ప్రయోజనాల కోసం తన సొంత ఆస్తులను ధారాదత్తం చేసిన నెహ్రూపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. నెహ్రూ లాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని, క్యారెక్టర్ లేని జగదీశ్వర్ రెడ్డి విమర్శించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. జగదీశ్వర్ రెడ్డి ఎంటో తనకు బాగా తెలుసునని, త్వరలో అతని బండారం మొత్తం బయటపెడతానని ఆయన హెచ్చరించారు.
పవర్ మంత్రి అయిన జగదీవ్వర్ రెడ్డికి ఒంట్లో పవరే లేదని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు విస్కీలో సోడా కలిపే వ్యక్తి కూడా మాజీ ప్రధానిని విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. తాము తిట్టడం మొదలు పెడితే తట్టుకొని, బయట తిరగగలిగే దమ్ముందా అని సవాల్ విసిరారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి అవినీతి మొత్తం బయటికి తీస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ వద్ద చెంచాగిరి చేసే వ్యక్తి, మహా నేత నెహ్రూని విమర్శించడం విడ్డూరమని పేర్కొన్నారు. మద్యం మత్తులో పవర్ మంత్రి ఎక్కడ సంతకం పెడతాడో తనకే తెలీదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకే ప్రాజెక్ట్‌ను చేపట్టారని, ప్రాజెక్ట్ నిర్వహణలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.