
నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్చకు కాంగ్రెస్ వ్యూహం
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో బీఆర్‌ఎస్‌పై దాడికి సన్నద్ధం
అసెంబ్లీలో చర్చ ద్వారా విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం
కమిషన్ విచారణపై పీపీటీకి చాన్స్ ఇవ్వాలంటున్న బీఆర్‌ఎస్
నివేదికను అడ్డం పెట్టుకొని బురదజల్లే ప్రయత్నమంటూ ఆరోపణ
సీబీఐ విచారణకు డిమాండ్ చేయనున్న బీజేపీ
ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
నాలుగు రోజులపాటు సమావేశాలు జరిగే అవకాశం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. సభలో వ్యవహరించాల్సిన తీరుపై అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచి్చన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి అధికార పార్టీ సిద్ధమవుతోంది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార పక్షం నుంచి ఎదురయ్యే విమర్శల దాడిని తిప్పికొట్టేందుకు బీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా ప్రాజెక్టు గురించి పూర్తిగా వివరించేందుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టనుందని తెలిసింది. ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణను సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేసే అవకాశముంది.
నాలుగు రోజులపాటు సమావేశాలు?
శనివారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ ఉభయ సభల సమావేశాలు నాలుగు రోజులపాటు కొనసాగే అవకాశమున్నట్లు సమాచారం. తొలిరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సంతాపం తెలిపిన అనంతరం అసెంబ్లీ వాయిదా పడనుంది.
అనంతరం శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన వేర్వేరుగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాలు జరుగుతాయి. స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ భేటీలో అసెంబ్లీ సమావేశాలు జరిగే తేదీలు, రోజువారీ ఎజెండాను ఖరారు చేయనున్నారు.
పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ, బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, యూరియా కొరత, వరద నష్టం, ప్రభుత్వ పరంగా పునరావాసం, సహాయక చర్యలు, గురుకుల విద్యా సంస్థల్లో సమస్యలు వంటి అంశాలను ఎజెండాలో చేర్చాలని అధికార, విపక్షాలు పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. వినాయక నిమజ్జనం నేపథ్యంలో సమావేశాలను వీలైనంత త్వరగా ముగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సమావేశాల్లోనే శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసే అవకాశముంది. ఈ మేరకు శనివారం స్పీకర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.
కాళేశ్వరం అవినీతిపై ప్రజల్లోకి..
అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను బహిర్గతం చేసే విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు, కోర్టు కేసులు.. ఇలా అన్నింటికి ఈ సమావేశాల్లోనే జవాబు చెప్పేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బలంగా వాదిస్తూ అసెంబ్లీ రికార్డుల్లోకి ఎక్కించాలనేది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇలా నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని భావిస్తోంది.
ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళిక, నాణ్యత, నిర్వహణ విషయాల్లో నిర్లక్ష్యం కారణంగానే మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిందని, ఈ ప్రాజెక్టు పరిధిలో నీటిని నిల్వచేయొద్దని ఎన్‌డీఎస్‌ఏ సూచించినందున ఈ ప్రాజెక్టును ఎలా వినియోగించుకోవాలనే అంశంపై అన్ని పార్టీల అభిప్రాయాలను ప్రభుత్వం కోరనుంది.
ఘోష్ నివేదికపై చర్యల కంటే దానిపై చర్చ జరగడమే ప్రధానమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేయడ మాత్రమే తమ ఉద్దేశం కాదని, అవసరమైతే బీజేపీ కోరుతున్నట్టు సీబీఐ విచారణకు కూడా వెనుకాడేది లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
అసెంబ్లీలోనే ఎండగట్టే వ్యూహంతో బీఆర్‌ఎస్
పీసీ ఘోష్ కమిషన్‌పై చర్చ, సిట్ ఏర్పాటు పేరిట ఇరకాటంలోకి నెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలను అసెంబ్లీ వేదికగానే తిప్పికొట్టాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, సీనియర్ నేతలు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్రంలో వరదల మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటాన్ని బీఆర్‌ఎస్ తప్పుపడుతోంది. ఘోష్ కమిషన్ నివేదికపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్.. సోమవారం మరోసారి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. న్యాయస్థానంలో విచారణ జరగమునుపే అసెంబ్లీలో నివేదికను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం తమపై బురద చల్లే ప్రయత్నంలో ఉందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది.
అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పీపీటీ ఇచ్చేందుకు అవకాశమివ్వాలని పట్టుబడుతోంది. ప్రభుత్వంలో అవినీతి, గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టు, నీటిపారుదల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగింత వంటి అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని భావిస్తోంది. ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో జరిగే చర్చలో ప్రతిపక్ష నేత కేసీఆర్ పాల్గొంటారా లేదా అనే అంశంపై బీఆర్‌ఎస్ గోప్యత పాటిస్తోంది. ఎరువుల కొరత, వరద నష్టంపై ప్రభుత్వం స్పందన వంటి అంశాలపై చర్చ కోసం పట్టుబట్టే వ్యూహంపై బీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది.
సీబీఐ విచారణకు బీజేపీ పట్టు
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు కోసం పట్టుబట్టాలని బీజేపీ శాసనసభా పక్షం నిర్ణయించింది. సీబీఐ విచారణ ద్వారానే నిజాలు నిగ్గు తేలుతాయని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సన్నద్ధమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణ కోసం మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్న బీజేపీ.. అసెంబ్లీలోనూ అదే వైఖరిని కొనసాగించాలని నిర్ణయించింది. ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై కేంద్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలను కూడా తిప్పికొట్టాలని భావిస్తోంది. సిట్ ఏర్పాటులో ప్రభుత్వం చేస్తున్న తాత్సారాన్ని కూడా నిలదీయాలని బీజేపీ నిర్ణయించింది. కాగా ఎంఐఎం, సీపీఐ పార్టీలు అధికారపక్షానికి మద్దతుగా నిలవనున్నట్లు సమాచారం.