కౌన్సిల్‌ x కమిషనరేట్‌ | Conflict between Devasena and Balakista Reddy in Telangana | Sakshi
Sakshi News home page

కౌన్సిల్‌ x కమిషనరేట్‌

May 26 2026 2:39 AM | Updated on May 26 2026 2:39 AM

Conflict between Devasena and Balakista Reddy in Telangana

తప్పు మీదే.. కాదు మీదే.. డిగ్రీ కోర్సులపై బాహాబాహీ 

దేవసేన.. బాలకిష్టారెడ్డి పరస్పర ఆరోపణలు 

ఉన్నత విద్యామండలి కోర్సులకు మంగళం 

కౌన్సిల్‌కు చెప్పకుండానే కాలేజీ కమిషనరేట్‌ కొత్త కోర్సులు 

ప్రభుత్వ కోర్టులో పంచాయితీ

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యామండలి, కాలేజీ విద్య కమిషనరేట్‌ మధ్య వివాదం రోడ్డుకెక్కింది. డిగ్రీ కోర్సులపై ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. కాలేజీ విద్య కమిషనర్‌ దేవసేన, మండలి చైర్మన్‌ ప్రొ.బాలకిష్టారెడ్డి మధ్య పరోక్ష మాటల యుద్ధం కొనసాగుతోంది. విధానపరమైన నిర్ణయాలపై ఒకరితో ఒకరు ఏకీభవించడం లేదు. ఇద్దరి మధ్య వివాదం డిగ్రీ ప్రవేశాల (దోస్త్‌)పై పడింది. దోస్త్‌ వెబ్‌సైట్‌ను హైజాక్‌ చేయడం, కోర్సులకు అనుమతి లేదంటూ రెండు ప్రభుత్వ సంస్థలు విమర్శలు ఆరోపించుకోవడం లక్షలాది మంది విద్యార్థులను గందరగోళంలోకి నెట్టింది.

కొంతకాలంగా జరుగుతున్న ఈ కోల్డ్‌వార్‌ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. దేవసేన వ్యవహారంపై బాలకిష్టారెడ్డి ఏకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుతో ఆయన సోమవారం భేటీ అయ్యారు. తన హక్కులను దేవసేన కాలరాస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పినట్టు సమాచారం. 

అసలేం జరిగింది? 
కౌన్సిల్, కాలేజీ కమిషనరేట్‌ మధ్య కొన్ని నెలలుగా కోల్డ్‌వార్‌ జరుగుతోంది. మండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి ప్రతీ ప్రతిపాదనను దేవసేనతోపాటు విద్యాశాఖ ముఖ్య అధికారి అడ్డుకుంటూ వస్తున్నారు. ఏడాది నుంచి బాలకిష్టారెడ్డి డిగ్రీ కోర్సుల స్వరూప స్వభావం మార్చేందుకు కొత్త కోర్సులపై కసరత్తు చేశారు. ఈ ఏడాది నుంచి వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.

బీఏలో సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ సైబర్‌ గవర్నెన్స్, డిఫెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్, ల్యాండ్‌–అగ్రికల్చర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్, బీబీఏలో ఎయిర్‌పోర్టు, ఎయిర్‌లైన్స్, ఏరోస్పేస్, హాస్పిటల్‌ అడ్మిని్రస్టేషన్, బీకాంలో ఈ–కామర్స్, డిజిటల్‌ మార్కెటింగ్, ఫైనాన్స్‌ టెక్నాలజీ కోర్సులను ప్రతిపాదించారు. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని ఈ కోర్సులను దోస్త్‌ వెబ్‌సైట్‌లోకి రెండో కౌన్సెలింగ్‌ నాటికి అప్‌లోడ్‌ చేయించారు.

ఇదే క్రమంలో కాలేజీ కమిషనరేట్‌ 11 కొత్త అప్రెంటిస్‌ ఎంబెడెడ్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ (ఏఈడీపీ) కోర్సులను ప్రతిపాదించడమే కాకుండా దోస్త్‌ వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్‌ చేసింది. బీఎస్సీలో ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్, ఈ మొబిలిటీ అండ్‌ బ్యాటరీ, హారి్టకల్చర్, ఫిషరీస్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్, బీకాంలో బిజినెస్‌ ఎనలటిక్స్, బీఏలో యానిమేషన్, ఫిల్మ్‌ అండ్‌ టీవీ ప్రొడక్షన్‌ వంటివి ఉన్నాయి. కమిషనరేట్‌ ప్రవేశపెట్టిన కోర్సులపై దోస్త్‌ కనీ్వనర్‌గా ఉన్న బాలకిష్టారెడ్డి అనుమతి తీసుకోకపోవడం వివాదానికి దారి తీసింది.  

పోర్టల్‌లో కోర్సులు బ్లాక్‌
ఉన్నత విద్యామండలి ప్రతిపాదించిన కోర్సులన్నీ అన్ని యూనివర్సిటీలు దోస్త్‌ రెండో దశ కౌన్సెలింగ్‌లో అప్‌లోడ్‌ చేశాయి. కానీ విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చేప్పుడు మాత్రం ఆ కోర్సులు చూపించడం లేదు. దోస్త్‌ పోర్టల్‌ పాస్‌వర్డ్‌ వర్సిటీ ఉన్నతాధికారులు, గుడ్‌గవర్నెన్స్‌ (సీజీజీ) అధికారుల వద్ద మాత్రమే ఉంటుంది. సీజీజీ ఉన్నతాధికారిపై కమిషరేట్‌ నుంచి ఒత్తిడి రావడంతో కౌన్సిల్‌ ప్రవేశపెట్టిన కోర్సులను బ్లాక్‌ చేశారు. దోస్త్‌ కనీ్వనర్‌ అనుమతివ్వని కమిషరేట్‌ ఎంబెడెడ్‌ కోర్సులను మాత్రం అప్‌లోడ్‌ చేశారు. దీనిపై దేవసేన వివరణ ఇచ్చారు.

ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టిన కోర్సులను ప్రైవేటు కాలేజీలకు గుర్తింపు ఇచ్చే వర్సిటీలు అనుమతించలేదని తెలిపారు. అసలు కొత్త కోర్సులపై వర్సిటీ అధికారులు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వలేదన్నారు. అందుకే ఆ కోర్సులను అందుబాటులోకి తేవడం కుదరదని చెప్పారు. ఇదంతా అబద్ధమని, వర్సిటీల భేటీలో అనుమతి ఇచి్చనట్టు తమ వద్ద ఆధారాలున్నాయని బాలకిష్టారెడ్డి తెలిపారు.

‘ఏడాదిగా కోర్సులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. డిగ్రీలో నాణ్యత పెంచే కోర్సులను తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. వీటి వల్ల వందశాతం ఉపాధి లభిస్తుంది. కోర్సులు ఆపేస్తే నష్టపోయేది విద్యార్థులే’అని బాలకిష్టారెడ్డి మీడియాతో అన్నారు. వివాదం వల్ల విద్యార్థులు నష్టపోకుండా చూడాలని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement