2027 డిసెంబర్‌ 9న ఎస్‌ఎల్‌బీసీ అంకితం | CM Revanth Reddy sets December 2027 deadline for SLBC completion | Sakshi
Sakshi News home page

2027 డిసెంబర్‌ 9న ఎస్‌ఎల్‌బీసీ అంకితం

Sep 5 2025 2:50 AM | Updated on Sep 5 2025 2:50 AM

CM Revanth Reddy sets December 2027 deadline for SLBC completion

ఎస్‌ఎల్‌బీసీపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌. చిత్రంలో హర్‌పాల్‌ సింగ్, పరీక్షిత్‌ మెహ్రా తదితరులు

సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన 

ఆలోగా శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం పూర్తి చేయాలి 

సొరంగం పనులు ఒక్కరోజు కూడా ఆలస్యం కావొద్దు 

ఇది నల్లగొండకే కాదు.. యావత్‌ తెలంగాణకు కీలకమని వెల్లడి 

మంత్రి ఉత్తమ్‌తో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం (ఎస్‌ఎల్‌బీసీ) పనులు ఒక్కరోజు కూడా ఆగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 డిసెంబర్‌ 9 నాటికి పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని స్పష్టంచేశారు. ఆ గడువులోగా పనులు పూర్తి చేసేందుకు ప్రతీ మూడు నెలల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను గ్రీన్‌ చానెల్‌ ద్వారా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

గురువారం తన నివాసంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ టన్నెల్‌ పూర్తవడం ఫ్లోరోసిస్‌ బాధిత జిల్లా అయిన నల్లగొండకు మాత్రమే కాకుండా తెలంగాణకు కీలకమని రేవంత్‌ చెప్పారు. గ్రావిటీ ద్వారా నీటిని ఇవ్వడానికి వీలున్న ఈ టన్నెల్‌ పనులు చాలా కాలంగా పెండింగ్‌లో పడటం వల్ల ఇబ్బందులు వచ్చాయన్నారు.

ప్రణాళిక ప్రకారం అత్యంత నైపుణ్యంతో సొరంగం తవ్వకాల పనులు చేపట్టాలని సూచించారు. గతంలో జరిగిన తప్పులు, లోటుపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీగా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అనుభవం ఉన్న ఆర్మీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.   

కేస్‌ స్టడీగా ఉండాలి 
ఎస్‌ఎల్‌బీసీ ఏళ్లకేళ్లుగా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న కలల ప్రాజెక్ట్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో దేశ విదేశాల్లో చేపట్టే టన్నెల్‌ ప్రాజెక్టులకు ఆదర్శంగా ఉండేలా దీని నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఇదొక కేస్‌ స్టడీగా ఉండాలని ఆకాంక్షించారు. అటవీ శాఖ, ఇంధన శాఖ, ఇరిగేషన్‌ విభాగంతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ పునరుద్ధరణ పనులకు అవసరమైన అన్ని అనుమతులు, నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నెల 15లోగా కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు.

ఒక్క సమావేశంలోనే అన్ని సమస్యలకు పరిష్కారం తీసుకురావాలని నిర్ణయించారు. సొరంగం పనులను వేగంగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థ జేపీ అసోసియేట్స్‌ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని.. కాంట్రాక్టు సంస్థ ఒక్క రోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకునేది లేదని సీఎం స్పష్టం చేశారు. అవసరమైన యంత్ర పరికరాలతోపాటు సరిపడేంత మంది నిపుణులు, కారి్మకులను రంగంలోకి దింపాలని సూచించారు. స్పెషల్‌ సెక్రటరీ, ఇండియన్‌ ఆర్మీ కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా మాట్లాడుతూ.. మొత్తం 44 కి.మీ. సొరంగమార్గానికిగాను ఇప్పటికే 35 కి.మీ. సొరంగం తవ్వడం పూర్తయిందని మిగిలిన సొరంగ మార్గం తవ్వడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు వివరించారు.

ప్రతి నెలా 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకుని జనవరి 2028 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన హెలీ–బోర్న్‌ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీంతో సొరంగం తవ్వకాల సమయంలో ముందుగానే ప్రమాదాలను పసిగట్టే వీలుంటుందని తెలిపారు. సమీక్షలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, ఆర్మీ రిటైర్డ్‌ ఇంజనీర్‌ ఇన్‌చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ హర్‌ పాల్‌ సింగ్, ఎన్జీఆర్‌ఐ డైరెక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement