
ముఖ్యమంత్రి కలల ప్రాజెక్ట్‌పై ప్రభావం
నాలాలు, నదీ గర్భంలో ఆక్రమణలే కారణం
ఇకనైనా మేల్కోపోతే భవిష్యత్తు ప్రమాదకరమే
సాక్షి, హైదరబాద్: ప్రతీ ఏటా మూసీ వరద భాగ్యనగరాన్ని ముంచేస్తోంది. నదీ గర్భం, పరీవాహక ప్రాంతాలలో ఆక్రమణలు, వరద కాల్వలు, నాలాల విస్తరణ లేకపోవడం వంటి కారణాలనేకం. ప్రభుత్వంతో పాటు ప్రజలూ బాధ్యతగా భాగస్వామ్యం అయితే తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ మూసీ పునరుజ్జీవం కార్యరూపం దాల్చడం కష్టమే. ఇప్పటికే గండిపేట నుంచి బాపూఘాట్ వరకూ మూసీ సుందరీకరణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. త్వరలోనే బ్యూటిఫికేషన్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇలాంటి తరుణంలో మూసీ వరద ముంచెత్తడంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు.
ఏటేటా వరదలే..
నగరం మధ్యలో 55 కి.మీ. మేర మూసీ ప్రవహిస్తుంది. దీనికి 1908లో 4.1 లక్షల క్యూసెక్కుల వరద వచి్చనప్పుడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితులను అడ్డుకట్ట వేసేందుకు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలను నిర్మించారు. 2.6 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా నిర్మాణం చేపట్టారు. కానీ, వందేళ్లలో మూసీ ఎన్నెన్నో ఆక్రమణలకు గురైంది. నగరంలో 1908 తర్వాత 62 ఏళ్లకు 1970లో వరదలు వచ్చాయి. అనంతరం 30 ఏళ్లకు 2000లో వరద సిటీని ముంచెత్తింది. ఆ తర్వాత 2008, 2014, 2016, 2018, 2020లలో కూడా వరదలు వచ్చాయి.
ఎక్కడ చూసినా ఆక్రమణలే..
నగరంలో గంటలో రెండు, మూడు సెంటీ మీటర్ల వర్షం పడితే తట్టుకునే వరద కాలువల వ్యవస్థే లేదు. అంతకుమించి కురిస్తే మునక తప్పడం లేదు. ఆక్రమణల కారణంగా రోజురోజుకూ కుంచించుకుపోతోంది. జియాగూడ, చాదర్‌ఘాట్, గోల్నాక, అంబర్‌పేట ఇలా ఎక్కడ చూసినా మూసీ వెంట ఆక్రమణలే ఉన్నాయి. మూసీ నదీ గర్భం, బఫర్ జోన్‌లలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి మూడు జిల్లాల్లో కలిపి 8 వేలకు పైగా ఆక్రమణలకు గురైనట్లు అధికారులు గుర్తించారు.
ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి..
నగరంలో చెరువులను కాపాడుకుంటూ.. పునరుద్దరించుకుంటూ వరద వెళ్లేలా చేయాలి. నీటి పారుదల శాఖ అధికారులు జీహెచ్‌ఎంసీ, జలమండలి, హైడ్రాను సమన్వయం చేసుకోవాలి. దీంతో పాటు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. నగరంలో వరద కాల్వల్లో ఏటా 5 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక వస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇంట్లోని పాత వస్తువులు నాలాల్లో వేయకుండా వ్యక్తిగత బాధ్యత వహించాలి.