‘గోదావరి’కి నేడు సీఎం శంకుస్థాపన | CM Revanth Reddy Foundation Godavari second and third phase works | Sakshi
Sakshi News home page

‘గోదావరి’కి నేడు సీఎం శంకుస్థాపన

Sep 8 2025 5:39 AM | Updated on Sep 8 2025 5:39 AM

CM Revanth Reddy Foundation Godavari second and third phase works

మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌

రూ.7,360 కోట్ల అంచనాతో జరగనున్న గోదావరి రెండు, మూడో దశ పనులు

మల్లన్నసాగర్‌ నుంచి 20 టీఎంసీల తరలింపు 

2027 డిసెంబర్‌ నాటికి హైదరాబాద్‌కు రోజూ నల్లా నీళ్లు 

రూ.298 కోట్ల ‘కోకాపేట్‌’ ప్రాజెక్టుకూ శంకుస్థాపన 

రూ.1,200 కోట్ల ఓఆర్‌ఆర్‌ రెండో దశ ప్రాజెక్టు ప్రారంభోత్సవం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర తాగునీటి అవసరాలను 2027 డిసెంబర్‌ నాటికి తీర్చడంతో పాటు నగరంలో రోజూ నల్లా నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన గోదావరి తాగునీటి పథకం రెండు, మూడో దశ పనులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సోమవారం గండిపేట వద్ద శంకుస్థాపన చేయనున్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన మరో రెండు ప్రాజెక్టులకు కూడా సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు.  

మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలు 
రూ.7,360 కోట్ల అంచనాలతో హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ (హామ్‌) విధానంలో గోదావరి తాగునీటి పథకం రెండు, మూడో దశ పనులు చేపట్టనున్నారు. మూసీ నదీ పునరుజ్జీవన పథకంలో భాగంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌ సాగర్‌ జలాశయాలకు తరలిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం పెట్టుబడి పెట్టనుండగా, 60 శాతం వాటాను నిర్మాణ సంస్థ భరించనుంది. 

రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. మల్లన్నసాగర్‌ నుంచి మొత్తం 20 టీఎంసీల నీళ్లను తరలించి ఆ నీళ్లతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జలాశయాలు నింపడంతో పాటు మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీలను విడుదల చేస్తారు. మిగిలిన 17.50 టీఎంసీల జలాలను హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మార్గమధ్యలో ఉన్న 7 చెరువులను కూడా నింపుతారు.  

ఓఆర్‌ఆర్‌ రెండో దశ ప్రాజెక్టు ప్రారంభం 
ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) రెండో దశలో భాగంగా రూ.1,200 కోట్లతో జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్‌ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, గ్రామ పంచాయితీలకు తాగునీటి సరఫరా చేసేందుకు నిర్మించిన ప్రాజెక్టును ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 71 రిజర్వాయర్లు నిర్మించగా, ఇటీవల కొత్తగా నిర్మించిన 15 రిజర్వాయర్లను సీఎం ప్రారంభిస్తారు. 

ఈ ప్రాజెక్టు ద్వారా సరూర్‌నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసర, రాజేంద్రనగర్, శామీర్‌పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్‌సీపురం, పటాన్‌చెరు, బొలారంతో సహా మొత్తం 14 మండలాల్లోని 25 లక్షల మందికి తాగునీరు అందుతుంది.  

నియో పోలిస్‌ సెజ్‌కు తాగునీటి సరఫరా.. 
కోకాపేట్‌ లేఅవుట్‌ సమగ్ర అభివృద్ధి–నియో పోలిస్‌ సెజ్‌కు తాగునీటి సరఫరాతో పాటు మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.298 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి 13 లక్షల మంది జనాభాకు లబ్ధి కలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement