తెలంగాణ హక్కులు, అస్తిత్వం కోసం ఎన్నో పోరాటాలు చేశాం: సీఎం కేసీఆర్‌

CM KCR Special Speech On Telangana National Integration Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సెప్టెంబర్‌ 17 సందర్బంగా అధికార టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరుగుతున్న వేడుకల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ క్రమంలోనే గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్‌ నివాళులు అర్పించారు. కాగా, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. 15 రోజుల పాటు ఘనంగా వజ్రోత్సవాలు జరిపాము. వేడుకలకు కొనసాగింపుగా సమైక్యతా వజ్రోత్సవాలు జరుపుతున్నాము. రాచరికం నుండి ప్రజాస్వామ్యం దిశగా తెలంగాణ నడిచింది. ఎందరో అమరయోధులు ప్రాణత్యాగం చేశారు. రాజరిక వ్యవస్థ నుంచి పరివర్తన చెందడానికి తెలంగాణ సమాజం మొత్తం పోరాడింది. అమరవీరులను తలచుకోవడం మన కర్తవ్యం. ఆనాడు ఉజ్వల ఉద్యమం జరిగింది.

కొమురం భీమ్‌, దొడ్డి కొమురయ్య సాహసాలు మరువలేం. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని తలచుకుందాం. నాటి పాలకుల కృషివల్లే భారతదేశం రూపుదిద్దుకుంది. దేశంలో తెలంగాణ అంతర్భాగమయ్యాక సొంత రాష్ట్రంగా మారింది. ఎందరో మహానుభావులు సామాజిక చైతన్యాన్ని రగిలించారు. తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు అయ్యింది. సమైక్య రాష్ట్రానికి వ్యతిరేకంగా తెలంగాణ పోరాడింది. తెలంగాణ లక్ష్యం సాధన కోసం 14 ఏళ్లు పోరాటం చేశాను. సమైక్య రాష్ట్రంలో తెలంగాణను నిర్లక్ష్యం చేశారు. రాష్ట్ర సాధన ఆకాంక్ష ప్రజల్లో చిగురించింది.

అద్భుత పోరాటంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాము. అన్ని రంగాల్లో అనేక అద్భుతాలను ఆవిష్కరించాము. రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగింది. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశాము. ప్రతీ ఇంటికి రక్షిత మంచి నీటిని అందిస్తున్నాము. జాతీయ సగటు కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ. పలు రంగాల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలో పంటల దిగుబడి గణనీయంగా పెరిగింది. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి.

నాటి చరిత్ర నుండి అనుభవాలు నేర్చుకోవాలి. అటువంటి వేదన మళ్లీ తెలంగాణకు రాకూడదు. మతతత్వ శక్తులు తెలంగాణను విభజించే కుట్ర చేస్తున్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా తీవ్రంగా నష్టపోతాము. విభజన శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలి. విష వ్యాఖ్యలతో మంటలకు ఆజ్యం పోస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top