
శనివారం నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన 22వ వార్షిక స్నాతకోత్సవంలో న్యాయ సంబంధ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, ఏసీజే జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ పీఎస్ నరసింహ, సీఎం రేవంత్‌రెడ్డి, నల్సార్ వీసీ ప్రొ. శ్రీకృష్ణారావు
75 ఏళ్లుగా దేశం చెక్కుచెదరకుండా ఉండటానికి దృఢమైన రాజ్యాంగమే కారణం
సీజేఐ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్
అంతర్గత సంఘర్షణలు ఎన్ని ఎదురైనా రాజ్యాంగం వల్లే తట్టుకొని నిలబడ్డాం
ఓయూలో ‘భారత రాజ్యాంగం: అంబేడ్కర్ పాత్ర’పై ప్రసంగం
రాజ్యాంగ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వెల్లడి
అంబేడ్కర్ పోస్టల్ కవర్ విడుదల.. పాల్గొన్న జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సుజోయ్‌పాల్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో రాష్ట్రంలో ఒకటి.. దేశంలో మరొకటి ద్వంద్వ పౌరసత్వం ఉంటుందని.. మన దేశం (రాజ్యం)లో అది సాధ్యం కాదని.. ఒకే దేశం–ఒకే రాజ్యాంగం మనదని బాబా సాహెబ్ అంబేడ్కర్ వ్యాఖ్యానించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేర్కొన్నారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఎలా పనిచేయాలో ఆయన రోడ్‌మ్యాప్ వేశారన్నారు.
75 ఏళ్లుగా ఇలా చెక్కుచెదరకుండా ఉన్నామంటే అందుకు దృఢమైన రాజ్యాంగమే కారణమని చెప్పారు. భవిష్యత్ అవసరాల మేరకు రాజ్యాంగ సవరణ అనివార్యమంటూనే ప్రాథమిక హక్కుల రక్షణ బాధ్యతను సుప్రీంకోర్టుకు అప్పగించారని వెల్లడించారు. భారత రాజ్యాంగం: అంబేడ్కర్ పాత్ర అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ రూపకల్పన సమయంలో అంబేడ్కర్ ఆలోచనా సరళిని లోతుగా విశ్లేషిచారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేరాలని.. రాజ్యాంగ విలువలు, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశంలో అంతర్గత సంఘర్షణలు ఎన్ని వచ్చినా మన రాజ్యాంగం వల్లే బలంగా తట్టుకొని నిలబడగలిగామని చెప్పారు.
నేరుగా ‘సుప్రీం’ను ఆశ్రయించే వెసులుబాటు..
‘భవిష్యత్తు అవసరాల రీత్యా రాజ్యాంగ సవరణకు అంబేడ్కర్ అనుమతించారు. ఆ స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది. అతి సమైక్య, అతి కేంద్రీకృత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ ఆత్మలా, రక్షణ కవచంలా ఆరి్టకల్ 32 పౌర హక్కులకు భంగం కలగకుండా కాపాడుతోంది.
పరిష్కార మార్గాలు లేని హక్కులున్నా ఉపయోగం లేదని అంబేడ్కర్ చెప్పిన విషయాన్ని మరిచిపోవద్దు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే వెసులుబాటును రాజ్యాంగం కల్పించింది. అమెరికాలో ద్వంద పౌరసత్వం అమల్లో ఉన్నా.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంతోపాటు సమాఖ్య పౌరసత్వం ఉంది.
అందుకు భిన్నంగా రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేలా బలమైన ప్రజాస్వామ్య రాజ్యంగా పటిష్టపరిచే ఒకే దేశం ఒకే రాజ్యాంగాన్ని అంబేడ్కర్ అమల్లోకి తీసుకురావడం గరి్వంచదగిన విషయం. 1973లో ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులపై ఘర్షణ వచ్చింది. దీనిపై 13 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది.
ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు కలిసే పనిచేస్తాయని తేల్చిచెప్పింది. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు కూడా రోడ్‌మ్యాప్ నిర్మాణంలో అంబేడ్కర్ పాత్ర ఎనలేనిది’అని సీజేఐ జస్టిస్ గవాయ్ వివరించారు. త్వరలోనే మళ్లీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఎక్కువ సమయం కేటాయిస్తానని ప్రసంగాన్ని ముగించారు.
అంబేడ్కర్‌కు హైకోర్టు సీజేగా ఆఫర్..
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ ప్రసంగిస్తూ ‘హైదరాబాద్ నా సొంత నగరం. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా. నా సొంత నగరంలో నా వర్సిటీకి సీజీఐ రావడం, ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం హర్షణీయం. అంబేడ్కర్‌కు హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. సామాజిక న్యాయ పోరాటంలో భాగంగా అంబేడ్కర్ భాగ్యనగరాన్ని సందర్శించారు.
నిజాం నవాబ్ ఆయన్ను కలసి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండాలని కోరారు. అయితే ఆ ఆఫర్‌ను అంబేడ్కర్ సున్నితంగా తిరస్కరించారు. మన దేశ రాజ్యాంగం ఎంతో గొప్పది.. ఔన్యతమైనది’అని వెల్లడించారు. అంబేడ్కర్‌తో హైదరాబాద్‌కు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేశారు. ఇక్కడ జరిగిన సామాజిక ఉద్యమాలకు ఆయన మద్దతు ప్రకటించారన్నారు.
అంబేడ్కర్ తన ఆత్మకథలో హైదరాబాద్ ఉద్యమాలు, సామాజిక న్యాయం సహా అనేక విషయాలను పొందుపరిచారని వివరించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ ప్రసంగిస్తూ 1947 అక్టోబర్‌లో రాజ్యాంగ ముసాయిదా సిద్ధమైందని.. రెండున్నరేళ్ల చర్చలు, భేటీల తర్వాత 1949 నవంబర్‌లో తుదిరూపు వచ్చిందన్నారు.
బీఆర్ గవాయ్ తండ్రి అంబేడ్కర్‌కు సన్నిహితుడు..
అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి ప్రసంగిస్తూ 1953 జనవరి 12న అంబేడ్కర్‌కు ఓయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందన్నారు. ఇది ఓ భారతీయ విశ్వవిద్యాలయం ఆయనకు ప్రదానం చేసిన తొలి డాక్టరేట్ అని చెప్పారు. బీఆర్ గవాయ్ తండ్రి ఆర్‌ఎస్ గవాయ్ అంబేడ్కర్‌కు అత్యంత సన్నిహితుడని.. దాదా సాహెబ్ గవాయ్‌గా ఆయన సుపరిచితుడన్నారు.
విద్యావేత్త, రాజకీయ నేత, సామాజిక కార్యకర్తగానే కాకుండా పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారన్నారు. ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం మాట్లాడుతూ... 108 ఏళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రగతిని నివేదించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, పీపీ పల్లె నాగేశ్వర్‌రావు, రిజిస్ట్రార్ జనరల్ (ఎఫ్‌ఏసీ) గోవర్దన్‌రెడ్డి, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ ఆచార్య జితేందర్ కుమార్ నాయక్, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ పోస్టల్ కవర్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్ విడుదల చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.