ప్రీ యాక్టివేషన్‌పై యాక్షన్‌ | City police bust ghost SIM network | Sakshi
Sakshi News home page

ప్రీ యాక్టివేషన్‌పై యాక్షన్‌

May 21 2026 4:26 AM | Updated on May 21 2026 4:26 AM

City police bust ghost SIM network

ఘోస్ట్‌ సిమ్‌ నెట్‌వర్క్‌ను ఛేదించిన సిటీ పోలీసులు 

‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌ 3.0’లో భాగంగానే నిర్వహణ

మొత్తం 13 రాష్ట్రాల్లో దాడులు చేసిన స్పెషల్‌ టీమ్స్‌ 

1,194 సిమ్‌కార్డుల ఆధారంగా 66 మంది అరెస్టు 

ఈ సిమ్‌ల ద్వారా కొల్లగొట్టిన మొత్తం రూ.101 కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌: ఘోస్ట్‌ సిమ్‌ కార్డుల నెట్‌వర్క్‌ను ఛేదించడమే లక్ష్యంగా హైదరాబాద్‌ సిటీ పోలీసు సైబర్‌ క్రైౖమ్‌ విభాగం ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌ 3.0’నిర్వహించింది. గతంలో మ్యూల్‌ ఖాతాదారులపై ఆపరేషన్‌ ఆక్టోపస్‌ 1.0, నేరాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై ఆపరేషన్‌ ఆక్టోపస్‌ 2.0 నిర్వహించగా.. తాజాగా సైబర్‌ నేరాలకు వెన్నెముకగా నిలుస్తున్న ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌కార్డుల నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం మోపింది. 

వివిధ నేరాల్లో వినియోగించిన 1,194 ఘోస్ట్‌ సిమ్‌ కార్డుల ఆధారంగా ముందుకెళ్లిన 18 ప్రత్యేక బృందాలు 13 రాష్ట్రాల్లో ఏడు రోజులు దాడులు నిర్వహించి 66 మంది నిందితులను అరెస్టు చేశాయి. వీరి నుంచి 544 సిమ్‌ కార్డులను స్వా«దీనం చేసుకున్నాయి. నగర పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ బుధవారం ఆ వివరాలు ప్రకటించారు. అరెస్టు అయిన వారిలో 44 మంది ఘోస్ట్‌ సిమ్‌ కార్డుల వినియోగదారులు, 20 మంది పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) ఏజెంట్లు లేదా టెలికాం ప్రమోటర్లు, ఇద్దరు సిమ్‌ కార్డుల సరఫరాదారులు ఉన్నారని ఆయన వివరించారు.

 వీరంతా కలిపి దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్‌ నేరాల్లో భాగస్వాములైనట్టు తేలింది. ఈ నేరాలకు సంబంధించిన బాధితులు మోసపోయిన మొత్తం రూ.101.87 కోట్లుగా ఉంది. ఈ సైబర్‌ నెట్‌వర్క్‌ను ఛేదించడంలో సైబర్‌ క్రైౖమ్‌ డీసీపీ వి.అరవింద్‌బాబు, ఏసీపీ ఆర్‌జీ శివమారుతి కృషి చేశారు.  

వివిధ టెలికం నెట్‌వర్క్‌ పీఓఎస్‌ ఏజెంట్లు 
సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్న 20 మంది పీఓఎస్‌ ఏజెంట్లలో వొడాఫోన్‌–ఐడియాకు చెందినవారు 10 మంది, ఎయిర్‌టెల్‌కు చెందినవారు ఏడుగురు, జియోకు చెందినవారు ముగ్గురు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. 

వినియోగదారులు కొత్త సిమ్‌ తీసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మొబైల్‌ నంబర్‌ పొర్టబిలిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు, వారికి తెలియకుండానే అదనపు సిమ్‌ కార్డులను యాక్టివేట్‌ చేస్తున్నారు. కస్టమర్ల నుంచి బయోమెట్రిక్‌ తీసుకునే క్రమంలో ‘నెట్‌వర్క్‌ సరిగా లేదు’, ‘సర్వర్‌ డౌన్‌ అయ్యింది’, ‘వేలిముద్ర సరిగా పడలేదు’అంటూ చెబుతున్న ఏజెంట్లు రెండు, మూడు బయోమెట్రిక్‌లను తీసుకుంటున్నారు.  

క్యాంపులు ఏర్పాటు చేసి మరీ దందా... 
మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి మరీ తమ పని కానిచ్చుకుంటున్నారు. తమకు కమిషన్‌తోపాటు సైబర్‌ నేరగాళ్ల నుంచి డబ్బులు కూడా వస్తుండటంతో దళారులు ఈ దందా చేస్తున్నారు. ఈ సాధారణ సిమ్‌ కార్డులను యాక్టివేట్‌ చేసిన వెంటనే, వాటిని ఇ–సిమ్‌లుగా మారుస్తున్నారు. విదేశాల్లో కూర్చున్న ప్రధాన సైబర్‌ ముఠాలకు క్షణాల్లో చేరవేస్తున్నారు. 

ఈ ఇండియన్‌ నంబర్లతో సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్‌ ఖాతాలు తెరవడంతోపాటు.. మ్యాట్రిమోనియల్‌ సైట్లు, ప్రముఖ డేటింగ్‌ యాప్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్‌ సృష్టిస్తారు. అమాయకులకు సైబర్‌ వల వేస్తారు. కొన్ని సందర్భాల్లో న్యూడ్‌ వీడియో కాల్స్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేసే ‘సెక్స్‌టార్షన్‌’ముఠాలు, సీబీఐ పోలీసులమంటూ భయపెట్టే ‘డిజిటల్‌ అరెస్ట్‌’ముఠాలు సైతం ఈ నంబర్లనే వాడుతున్నాయి. 

ఇదంతా పక్కా వ్యూహంతో జరుగుతోంది. ఈ ‘ఘోస్ట్‌ సిమ్‌’నెట్‌వర్క్‌ వ్యవహారాన్ని హైదరాబాద్‌ సిటీ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. త్వరలో ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్‌–ఐడియా వంటి టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్ల ఉన్నతాధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు.  

ఇలా సరిచూసుకోండి  
మీ పేరు మీద మీకు తెలియకుండా ఎన్ని సిమ్‌ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయనేది కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌ (https://tafcop.sancharsaathi.gov.in) ద్వారా వెంటనే చెక్‌ చేసుకోండి. ఈ ’సంచార్‌ సాథీ’పోర్టల్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ, మీకు తెలియకుండా ఎవరైనా మీ నంబర్‌ను వాడుతుంటే వెంటనే అందులోనే రిపోర్ట్‌ చేసి బ్లాక్‌ చేయండి. సైబర్‌ బాధితులుగా మారితే వెంటనే 1930 టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేయండి లేదా (www.cybercrime.gov.in))లో ఫిర్యాదు చేయండి. హైదరాబాద్‌ సిటీ పోలీసులు అందిస్తున్న ‘సి–మిత్ర’సేవలను కూడా సది్వనియోగం చేసుకోండి.   – వీసీ సజ్జనర్, హైదరాబాద్‌ సీపీ  

Advertisement
 
Advertisement
Advertisement