
రకరకాల కారణాలతో ఇళ్ల నుంచి పారిపోతున్న చిన్నారులు
వారిలో సింహభాగం రైళ్ల ద్వారా వేరే ప్రాంతాలకు పయనం
అక్రమంగా చిన్నారులను రవాణా చేస్తున్న ముఠాల సంచారం
గత రెండున్నరేళ్లలో 3,400 మందిని రక్షించిన రైల్వే రక్షక దళం
దక్షిణ మధ్య రైల్వే డివిజన్ ప్రదాన కేంద్రాల్లో హెల్ప్ డెస్‌్కల ఏర్పాటు
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ స్టేషన్‌లో ఆగింది. అక్కడ 26 మంది చిన్నారులతో ఎనిమిది మంది వ్యక్తులు రైలెక్కారు. వారు సికింద్రాబాద్‌లో దిగాల్సి ఉంది. సాధారణంగా రైలెక్కినప్పుడు చిన్నారుల్లో ఓ సంబరం కనిపిస్తుంది, కిటికీల్లోంచి చూస్తూ కేరింతలు కొట్టడం సహజం. కానీ, ఈ చిన్నారుల్లో ఎక్కడా చలాకీతనం లేదు, దిగాలుగా కూర్చున్నారు. ఇది గమనించిన ఓ ప్రయాణికుడు విషయాన్ని రైల్వే అధికారులకు చెప్పాడు. రైలు సికింద్రాబాద్‌లో ఆగగానే, రైల్వే భద్రతా దళ సిబ్బంది కోచ్‌లోకి వచ్చి వారందరినీ అదుపులోకి తీసుకుంది. ఆరా తీస్తే.. ఆ 26 మందిని హైదరాబాద్ శివారులోని పరిశ్రమల్లో బాలకార్మికులుగా వెట్టి చేయించేందుకు తరలిస్తున్నట్టు తేలింది. పిల్లలను తరలిస్తున్న వారిని అరెస్టు చేసి.. ఆ బాలలకు స్వేచ్ఛ కల్పించారు. - సాక్షి, హైదరాబాద్
ముంబై వెళ్లే రైలు జనరల్ కోచ్ ఎక్కిన ఇద్దరు 13 ఏళ్ల బాలికలు, రాత్రి వేళ స్లీపర్ కోచ్‌లోకి చేరుకున్నారు. వారి వద్ద అన్ రిజర్వ్‌డ్ టికెట్లు మాత్రమే ఉండటంతో టీసీ నిలదీశాడు. పొంతనలేని సమాధానం చెప్పటంతో ఆర్‌పీఎఫ్ సిబ్బందికి ఆయన సమాచారమిచ్చాడు. వారు బాలికలను అదుపులోకి తీసుకుని విచారిస్తే, చదవడం ఇష్టం లేక ఇంటి నుంచి పారిపోయినట్టు వెల్లడించారు. దీంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
బడికి వెళ్లటం ఇష్టం లేక కొందరు.. తల్లిదండ్రుల మధ్య తరచూ జరిగే గొడవలతో విసిగిపోయి మరికొందరు.. సినిమాల్లో నటించాలని ఇంకొందరు.. కిడ్నాప్‌నకు గురై మరికొందరు.. ఇలా అనేక కారణాలతో తరచూ రైళ్లలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తు్తన్న బాలలను రైల్వే రక్షక దళం సిబ్బంది కాపాడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గత రెండున్నరేళ్లలో 3,433 మంది ఇలాంటి చిన్నారులను రక్షించారు. ఇది పెద్ద సంఖ్య కావటంతో మరింత అప్రమత్తంగా ఉండేందుకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇస్తోంది.
రైళ్లెక్కేస్తున్నారు
ఇళ్ల నుంచి పారిపోయే చిన్నారుల్లో అత్యధికులు రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. రోడ్డు మార్గాన వెళ్తే పోలీసు తనిఖీలు ఉంటాయన్న ఉద్దేశంతో, పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠాలు కూడా రైళ్లనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి. వీరిని గుర్తించేందుకు ఇప్పుడు రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్‌పీ) సిబ్బంది మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, తిరుపతి, విజయవాడ, నాందేడ్ డివిజన్‌హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేకంగా చైల్డ్ హెల్ప్ డెస్‌్కలు ఏర్పాటు చేశారు.
ఇళ్లనుంచి పారిపోయి రైలెక్కుతున్న చిన్నారులు, అక్రమ రవాణాలో భాగంగా తరలిస్తున్న పిల్లలను గుర్తించి రక్షించటమే ఈ డెస్క్‌ల పని. రైల్వే స్టేషన్లలో నిఘా ఉంచడం, సంబంధిత విభాగాలతో సమన్వయం చేయడం, కోచ్‌లూ స్టేషన్‌లలో గుర్తించిన పిల్లలకు తక్షణ సంరక్షణ క ల్పించటం, ప్రజలలో అవగాహన క ల్పించడం ద్వారా ఈ డెస్‌్కలు అలాంటి చిన్నారులు ఆపదల్లో చిక్కుకోకుండా చూడగలుగుతున్నాయి. ఈ పిల్లలను గుర్తించేందుకు రైల్వే స్టేషన్‌లలో సీసీటీవీ కెమెరాల సంఖ్య కూడా పెంచుతున్నారు.
ప్రత్యేక కార్యక్రమాలు
రైల్వే భద్రతా విభాగం ‘ఆపరేషన్ నన్హే ఫరిõÙ్త’, ‘ఆపరేషన్ – యాక్షన్ అగైనస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్’వంటి ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించింది. ఒంటరిగా రైళ్లలో సంచరించే చిన్నారులు, బలవంతంగా వారిని తరలించేవారిని గుర్తించి వివరాలు వాకబు చేసి ప్రమాదంలో ఉన్న చిన్నారులను రక్షించి తిరిగి ఇళ్లకు తరలిస్తున్నారు. ఇళ్లకు వెళ్లేందుకు నిరాకరించే వారిని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలకుగాను పోలీసులకు అప్పగిస్తున్నారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పనిచేసే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీసులకు ఇప్పుడు ఇలాంటి చిన్నారులను గుర్తించి కాపాడే విషయంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ‘బచ్‌పన్ బచావో ఆందోళ¯న్’అనే సంస్థతో కలిసి జోనల్ స్థాయిలో సిబ్బందికి శిక్షణ అందిస్తున్నారు. ఇవి సత్ఫలితాలనిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా 16వేల మంది
⇒ 2024 నుంచి ఈ ఏడాది జూన్ వరకు దేశవ్యాప్తంగా రైల్వే శాఖ 16వేల మంది చిన్నారులను కాపాడింది. వీరిలో 3,000 మంది అమ్మాయిలే. నన్హే ఫరిõÙ్త కార్యక్రమం ద్వారా ఒక్క 2024లోనే 10వేలకుపైగా కుర్రాళ్లను కాపాడారు. ఈ ఏడాది జూన్ వరకు 6వేలకుపైగా చిన్నారులను సురక్షితంగా వెనక్కు తీసుకొచ్చారు.
⇒ రైల్వే కోచ్‌లు, స్టేషన్‌లలో అనుమానాస్పదంగా తిరిగే చిన్నారులు; ఆందోళనగా కనిపించే పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు @RailMinIndia, @SCRailwayIndia, @Gmscrailway తదితర ఎక్స్ హ్యాండిల్స్‌లో కూడా పోస్ట్ చేయవచ్చు.
139కి సమాచారమివ్వండి
‘ఇళ్ల నుంచి పారిపోయే చిన్నారులు, చైల్డ్ ట్రాఫికింగ్‌కు బలయ్యే బాలలను రక్షించే సామాజిక బాధ్యతతో రైల్వే శాఖ ప్రత్యేక చొరవ చూపుతోంది. ఈ విషయంలో ఎన్నో అద్భుత విజయాలు సాధించి వేలాది బాధిత చిన్నారులను రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. రైల్వే చొరవకు ప్రజల సహకారం తోడైతే మరింత మందిని రక్షించవచ్చు. రైలు ప్రయాణికులు పరిసరాలను గమనిస్తూ అనుమానం ఉన్న చిన్నారుల విషయాన్ని 139 ద్వారా గాని, రైలు మద్దతు పోర్టల్ ద్వారా గాని సమాచారం అందిస్తే రైల్వే సిబ్బంది వెంటనే స్పందిస్తారు’. – ఎ.శ్రీధర్, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి