రాత పరీక్షలో అవకతవకలు.. జేఎల్‌ఎం నోటిఫికేషన్‌ రద్దు! 

Cancellation Of TSSPDCL JLM Notification In Telangana - Sakshi

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ ప్రకటన

త్వరలో మళ్లీ కొత్తగా నోటిఫికేషన్‌ జారీ

రాత పరీక్షలో అవకతవకల నేపథ్యంలో చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)లో వెయ్యి జూనియర్‌ లైన్‌మెన్‌(జేఎల్‌ఎం) పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్టు సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి గురువారం ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీకి త్వరలో మరో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేస్తామని వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీకి గత జూలై 17న నిర్వహించిన రాత పరీక్షలో అవకతవకలు చోటు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 

రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు, మరికొంత మంది దళారులతో కలిసి పలువురు అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరీక్షా కేంద్రాల్లో వారికి సమాధానాలు చేరవేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పటికప్పుడు కొందరు విద్యు త్‌ అధికారులు, సిబ్బందిని రాచకొండ కమిషనరేట్‌ పోలీసులు విచారించి అరెస్టు చేశారు. మొత్తం 181 అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. మరింత మంది అభ్యర్థులకు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉండే అవకాశాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా, పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కొంత మంది అభ్యర్థులు హైదరాబాద్‌లోని మింట్‌ కాంపౌండ్‌లో ఉన్న సంస్థ కార్యాలయం ఎదుట అప్పట్లో ధర్నాలు నిర్వహించారు. అభ్యర్థుల నుంచి వ చ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటూ జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి గత మే 9న జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. 

నోటిఫికేషన్‌ రద్దుపై అభ్యర్థుల్లో అసంతృప్తి
జేఎల్‌ఎం రాత పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని తాము కోరితే ఏకంగా నోటిఫికేషన్‌ రద్దు చేయడం సరికాదని కొందరు జేఎల్‌ఎం అభ్యర్థులు పేర్కొంటున్నారు. మళ్లీ కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేస్తే నియామక ప్రక్రియలో తీవ్ర జా ప్యం జరుగుతుందని, మళ్లీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ‘గాంధీ’లో అరుదైన శస్త్రచికిత్స: సినిమా చూపిస్తూ సర్జరీ చేసేశారు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top