గాజులరామారంలో బీఆర్‌ఎస్ నేతల ఆందోళన
సర్వేనంబర్ 307లో గాంధీ 11 ఎకరాలు ఆక్రమించారని ఆరోపణ
నిజాంపేట్/మణికొండ: పెద్దలను కాపాడేందుకు పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని, హైడ్రాతో ప్రభుత్వం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, మాజీ మంత్రులు ఆరోపించారు. ఆదివారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గాజులరామారంలోని సర్వే నంబర్ 307లోని భూమిని పరిశీలించారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కుటుంబ సభ్యులు ఈ సర్వే నంబర్‌లో 11 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ నిరసన తెలిపారు.
సర్వే నంబర్ 307లో పేదలకు చెందిన సుమారు 270 ఇళ్లను కూల్చిన హైడ్రా అధికారులు.. అరెకపూడి గాంధీకి చెందిన 11 ఎకరాల స్థలానికి వేసిన బారికేడ్లను కూల్చిన వెంటనే తిరిగి నిర్మిస్తే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గాం«దీ.. పార్టీ మారినందుకు రూ.1,100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నజరానాగా కట్టబెట్టిందని ఆరోపించారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు కేపీ వివేకానంద్, మధుసూదనాచారి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, సునీతా లక్ష్మారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, శంభీపూర్ రాజు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం మరోవైపు నార్సింగిలోని శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్ సంస్థ మూసీ నదిలో నిర్మిస్తున్న భవనాన్ని ఎమ్మెల్యేలు సు«దీర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిలతో కలిసి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు.
పేదలు కట్టుకున్న గృహాలను మూసీ సుందరీకరణ పేరుతో కూల్చివేశారని, అదే మూసీ నదిలో నిర్మిస్తున్న శ్రీఆదిత్య నిర్మాణానికి ఎందుకు మార్కింగ్ వేయలేదని ఆమె ప్రశ్నించారు. పేదల ఆస్తులు కూల్చటం, పెద్దల వద్ద డబ్బులు దండుకోవటమే హైడ్రా పనా? అని నిలదీశారు.
నేను సిద్ధం.. మీరు సిద్ధమా: అరెకపూడి
ఆల్విన్ కాలనీ: తన భూములపై వస్తున్న ఆరోపణలపై అరి కెపూడి ఆదివారం వివరణ ఇచ్చారు. ‘సర్వే నంబర్ 307లో 11 ఎకరాలు కొన్న మాట వాస్తవమే. 9 మంది కుటుంబ సభ్యులు, మాజీ కార్పొరేటర్ శోభనాద్రి, నిజామాబాద్‌కు చెందిన కొందరు కలిసి 11 ఎకరాలను 1991లో కొనుగోలు చేశాం. 2014 నుంచి 2024 దాకా ఏ ఎమ్మెల్యే ఎంత అక్రమాస్తులు సంపాదించాడో తేల్చేందుకు సీబీఐ, ఈడీతో దర్యాప్తునకు మీరు సిద్ధమేనా?’ అని సవాల్ చేశారు.


