
ప్రభుత్వ సిఫారసులను పెండింగ్‌లో పెట్టిన గవర్నర్
అనర్హులను సిఫారసు చేశారని ఫిర్యాదులు అందడంతో చర్యలు
ప్రభుత్వం నుంచి వివరణ కోరనున్న రాజ్‌భవన్
కొందరి పేర్లు మినహా మిగిలిన వారిని ఆమోదించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సమాచార కమిషన్‌లో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, ఇతర సమాచార కమిషనర్ల భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా ఐఎఫ్‌ఎస్ అధికారి జి.చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మరో ఏడుగురు సమాచార కమిషనర్ల నియామక ప్రతిపాదనలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం కోసం గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కు పంపించింది. కొందరు అభ్యర్థుల అర్హతల విషయంలో ఫిర్యాదులు అందడంతో సంబంధిత ఫైల్‌ను గవర్నర్ పెండింగ్‌లో ఉంచినట్టు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. ఈ విషయంలో రాజ్‌భవన్ ప్రభుత్వం నుంచి వివరణ కోరనున్నట్టు తెలిసింది.
కొన్ని పేర్లపై అభ్యంతరం
ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్ల పోస్టుల భర్తీ కోసం 2023 జూలై 4న ఒకసారి, 2024 జూన్ 12న మరోసారి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. సీఎం ఎ.రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడిన కమిటీ ఇటీవల సమావేశమై పలువురిని ఎంపిక చేసి రాజ్‌భవన్‌కు సిఫారసు చేసింది. ప్రధాన సమాచార కమిషనర్‌గా చంద్రశేఖర్‌రెడ్డి, సమాచార కమిషనర్లుగా జర్నలిస్టులు పీవీ శ్రీనివాస్‌రావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, కప్పర హరిప్రసాద్, న్యాయవాది పీఎల్‌ఎన్ ప్రసాద్‌తో పాటు రాములు, వైష్ణవి, మొహిసిన పర్వీన్ పేర్లను ప్రతిపాదించింది.
సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 12(5) ప్రకారం న్యాయశాస్త్రం, సైన్స్, టెక్నాలజీ, సామాజిక సేవ, మెనేజ్‌మెంట్, జర్నలిజం, పరిపాలన రంగాల్లో విశేష కృషిచేసినవారు ఈ పోస్టులకు అర్హులు. సెక్షన్ 12(6) ప్రకారం వారు ఎమ్మెల్యే, ఎంపీ కారాదు. ఎలాంటి లాభదాయక పోస్టులో ఉండరాదు. రాజకీయ పార్టీతో ఎలాంటి అనుబంధం కలిగి ఉండరాదు. వ్యాపారాలు, ఇతర వృత్తుల్లో ఉండరాదు.
కానీ, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లలో కొందరికి రాజకీయ నేపథ్యం ఉండడంతో పలువురు వ్యక్తులు రాజ్‌భవన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫైల్‌కు ఆమోదం తెలపకుండా గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. అర్హతల విషయంలో స్పష్టత వచి్చన తర్వాతే గవర్నర్ ఆమోదించే అవకాశం ఉంది. అవసరమైతే గవర్నర్ కొందరు అభ్యర్థుల పేర్లను మినహాయించి ఇతరుల పేర్లను ఆమోదించే అవకాశం ఉంది. వారం రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రానుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.