
అమిత్‌షాకు పుష్పగుచ్ఛం అందిస్తున్న భట్టి. చిత్రంలో తుమ్మల, జితేందర్‌రెడ్డి
తెలంగాణలో వరదలను జాతీయ విపత్తుగా గుర్తించండి
ప్రాథమిక అంచనా ప్రకారం రూ.5018.72 కోట్ల నష్టం
గతేడాది రూ.11,713 కోట్ల నష్టానికీ సాయం అందలేదు
గత, ప్రస్తుత సాయం కింద 16,732 కోట్లు అందించండి
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల విజ్ఞప్తి
త్వరలోనే కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపుతామని అమిత్ షా హామీ
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సాయం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలకు భట్టి, తుమ్మల వినతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలను జాతీయ విపత్తుగా పరిగణించి ప్రత్యేక సాయం అందించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కోరారు. వర్షాలతో భారీగా పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని, కేంద్రం తక్షణమే సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో అమిత్ షా అధికారిక నివాసంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆగస్టు 25 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని.. కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ విధ్వంసం జరిగిందని తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.5,018 కోట్ల మేర నష్టం జరిగిందని వివరించారు. గతేడాది ఖమ్మంతోపాటు పరిసర జిల్లాల్లో భారీవర్షాల కారణంగా రూ.11,713 కోట్ల మేరకు నష్టం వాటిల్లగా, అప్పుడే దీనికి సంబంధించిన నష్ట అంచనా నివేదికను కేంద్రానికి పంపామని గుర్తుచేశారు. ఈ రెండేళ్లకు కలిపి రూ.16,732 కోట్ల సాయాన్ని తక్షణమే అందించాలని కోరారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులివ్వండి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్‌రావు కోరారు. ఢిల్లీలో ఆమె కార్యాలయంలో గురువారం కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్రంలో విద్యా నాణ్యత, పిల్లల పోషకాహారం అనే రెండు సవాళ్లను పరిష్కరించడానికి ప్రవేశపెట్టిందే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రోగ్రాం అని వివరించారు. 105 అత్యాధునిక రెసిడెన్షియల్ క్యాంపస్‌లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. ఈ సమగ్ర విద్యా విధానం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని చెప్పారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.110 కోట్లు ఇవ్వండి
రూరల్ రోడ్ కనెక్టివిటీ ప్రోగ్రాం కింద ఖమ్మంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.110 కోట్లు ఇవ్వాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కోరారు. ఢిల్లీలో గురువారం పెమ్మసానితో తుమ్మల భేటీ అయ్యారు.
ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో గిరిజనులు అధికంగా నివసిస్తున్నారని, ఈ ప్రాంతంలో సిమెంట్ కాంక్రీట్ డ్రైనేజింగ్ నెట్‌వర్క్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తుమ్మల మీడియాకు వెల్లడించారు.