అదనపు వనరులపై దృష్టిపెట్టండి | Bhatti Vikramarka: Collect pending dues | Sakshi
Sakshi News home page

అదనపు వనరులపై దృష్టిపెట్టండి

Jan 18 2024 5:50 AM | Updated on Jan 18 2024 5:50 AM

 Bhatti Vikramarka: Collect pending dues - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంతోపాటు అదనపు వనరుల సమీకరణపై దృష్టిపెట్టాలని వివిధ శాఖల అధికారులను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి రావాల్సిన పెండింగ్‌ బకాయిలను వసూలు చేయాలని సూచించారు. బుధవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలసి పరిశ్రమలు, గనులు, భూగర్భ వనరులు, హౌజింగ్‌ కార్పొరేషన్, బోర్డు, హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ ఉన్నతాధికారులతో భట్టి సమీక్షించారు. పరిశ్రమల శాఖ, టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏల పరిధిలో ఇప్పటివరకు జరిగిన భూముల అమ్మకాలు, వాటితో రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం, రావాల్సిన బకాయిలు, వాటి వసూలు కోసం కార్యాచరణపై చర్చించారు. 

ప్రతి పైసా రాబట్టండి 
ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసానూ సమీకరించే బాధ్యతను ఆయా శాఖల అధికారులు తీసుకోవా లని భట్టి స్పష్టం చేశారు. ఇండ్రస్టియల్‌ పార్కులను వినియోగంలోకి తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టాలన్నారు. తూప్రాన్‌ ఇండ్రస్టియల్‌ పార్కు కోసం ప్రభుత్వం 325 ఎకరాలు కేటాయించగా.. ఇప్పటివరకు 139 ఎకరాలు అప్పగించారని, మిగతా భూమిని సేకరించాల్సి ఉందని అధికారులు వివరించారు.

హౌజింగ్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన 12 జాయింట్‌ వెంచర్లలో 6 పూర్తయ్యాయని.. వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.955 కోట్లు రావాల్సి ఉండగా, రూ.430 కోట్లు వచ్చాయని వివరించారు. మైనింగ్‌ రాయల్టీ ద్వారా రావాల్సిన ఆదాయం, దానిని పెంచుకోవడానికి ఉన్న అవకాశాలపై కూడా గనుల శాఖ అధికారులను మంత్రి ఆరా తీశారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో గనులు భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్‌దత్‌ ఎక్కా, ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రెటరీ హరిత, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ రెహమాన్, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ విజయేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement