ప్రజలపై భారం మోపం | Bhatti Vikramarka: Collect every penny due to govt | Sakshi
Sakshi News home page

ప్రజలపై భారం మోపం

Jan 19 2024 2:14 AM | Updated on Jan 19 2024 2:14 AM

Bhatti Vikramarka: Collect every penny due to govt - Sakshi

మాట్లాడుతున్న భట్టి. చిత్రంలో పొంగులేటి

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలపై భారం మోపకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. వార్షిక బడ్జెట్‌ 2024–25 ప్రతిపాదనల రూపకల్పనలో భాగంగా గురువారం సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తోకలిసి వ్యవసాయం, మార్కెటింగ్, చేనేత జౌళి, ఉద్యాన వన, రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార /ప్రజాసంబంధాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఆస్తులు సృష్టించి, వాటితో వచ్చే ఆదాయా న్ని ప్రజలకు పంచడానికి కృషి చేయాలని అధికా రులకు దిశానిర్దేశం చేశారు. ఆరు గ్యారంటీల అమలు, గడువు ముగిసిన భూముల లీజుపై దృష్టి సారించాలన్నారు.  

అసైన్డ్‌ భూములపై నివేదిక ఇవ్వాలి..
గత ప్రభుత్వం ధరణిలో ‘కాస్తు’ కాలమ్‌ తొలగించడంతో పాటు ప్రభుత్వ, అసైన్డ్, మాన్యం, ఎండోమెంట్, కొన్ని పట్టా భూములను పార్ట్‌–బీలో పెట్టి రైతుల హక్కులను కాలరాసిందన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏటా రెవెన్యూ సదస్సులు నిర్వహించి జమాబందీ చేసేవారని, 2014 తర్వాత ఈ విధానానికి స్వస్తి పలకడంతో రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ధరణితో  ప్రభుత్వ భూములు కొందరి చేతుల్లోకి వెళ్లాయని, వాటిని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూశాఖను ఆదేశించారు.

2014 వరకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములు, గత ప్రభుత్వం వెనక్కి తీసుకున్న అసైన్డ్‌ భూములను ఏ అవసరాల కోసం వాడారు.. వెనక్కి తీసుకున్న భూముల్లో మిగిలి ఉన్న భూమి ఎంత? వంటి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఆపద్బంధు, పిడుగుపాటు మృతులకు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే పథకాలను గత ప్రభుత్వం అమలు చేయలేదని అధికారులు వివరించారు. కేంద్రం ఈ పదేళ్లలో రాష్ట్రంలో 1.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి మాత్రమే నిధులిచ్చిందని, 2023–24లో ఇళ్ల నిర్మాణ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసిందని మంత్రులకు తెలిపారు. 2024–25లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలను వివరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 2లక్షల గాను 67 వేల ఇళ్లు పూర్తి చేశామని చెప్పారు.   

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం: నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా అరికట్టాలని, నిబంధనలు పాటించని కంపెనీలపై ఉక్కు పాదం మోపాలని మంత్రులు ఆదేశించారు. బతుకమ్మ చీరలు, విద్యా ర్థుల యూనిఫామ్‌ల తయారీపై ఆరా తీశారు. ఈ సమీక్షలో ఆర్థిక, రెవెన్యూ(విపత్తు) శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అర్వింద్‌ కుమా ర్, నవీన్‌మిత్తల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement