
కాకతీయుల వంశవృక్షాన్ని తెలిపే బయ్యారం శాసనం
పొడవాటిరాయిపై నాలుగు వైపులా తెలుగు, కన్నడ, సంస్కృత లిపిలో వంశవృక్షం
బయ్యారం: ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయరాజుల వంశవృక్షం.. ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్దచెరువు కట్టపై లిఖించిన శిలాశాసనం ద్వారా అందుబాటులో ఉంది. పొడవాటిరాయిపై తెలుగు, కన్నడ, సంస్కృత లిపిలో ఉన్న కాకతీయరాజుల వంశవృక్షం, నాటి రాజుల పరిపాలనాదక్షతను తెలియజేస్తోంది.
శాసనంలో ఏముందంటే..
వెన్నురాజు కాకతీయ రాజ్యాన్ని ఏలుతుండగా మొదటి గుండు, రెండో గుండు, మూడో గుండురాజులు జన్మించారు. వీరు రాజ్యాన్ని పాలించగా.. ఆ తర్వాత కుమారులు, మనుమలు, మనుమడి కుమారులు పాలన సాగించారు. వారి తర్వాత ఎర్రమరాజు కాకతీయ రాజ్యాన్ని పాలించగా.. ఆ తర్వాత పిండిగుండమ రాజు అనుమ, కొండ ప్రాంతాలను ఏలుతున్న రాజులను సంహరించి అనుమకొండ పేరున రాజధానిని ఏర్పాటు చేశాడు. అతనికి ప్రోలరాజు జన్మించాడు. అతను ప్రజల్లో దేవునిగా పేరు తెచ్చుకున్నాడు.
ప్రోలరాజుకు త్రిభునవ మల్లరాజు జన్మించగా.. అతను శత్రువులు భయభ్రాంతులయ్యేలా పాలనను కొనసాగించాడు. త్రిభునవ మల్లరాజుకు రుద్రదేవుడు, మహాదేవుడు సంతానం. వీరిలో రుద్రదేవుడు శక్తిమంతుడు. మహదేవుడు దానధర్మాల్లో దేవేంద్రుడు. ఇతని భార్య బయ్యమాంబ.. శివునికి పార్వతిలా వ్యవహరించింది. వీరికి మైలమాంబ, గణపతిదేవుడు సంతానం. వీరిలో గణపతిదేవునికి 1105 సంవత్సరంలో కుమార్తె జన్మించింది. ఆమెకు శ్రీశైల మల్లికార్జునుడి పేరిట ధర్మకీర్తిగా ధర్మానికి ప్రతిగా పేరు పెట్టారు.
మహదేవుడు తన కుమార్తె మైలమాంబకు తగిన సంబంధం చూడాలని మంత్రులను ఆదేశించాడు. మంత్రులు నటవాడి వంశీయుడైన రుద్రరాజును మైలమాంబకు తగిన వ్యక్తిగా ఎంపిక చేశారు. రుద్రదేవునికి మైలమాంబను ఇచ్చి వివాహం చేయగా.. వారు పార్వతీ పరమేశ్వరులుగా విలసిల్లారు.. ఇవీ శాసనంలో పేర్కొన్న వివరాలు. మైలమాంబ తన తల్లి బయ్యమాంబ పేరున ప్రజా క్షేమాన్ని కోరి జలనిధి (చెరువు)ని ఏర్పాటు చేసినట్లు ఈ శాసనం తెలుపుతోంది.
నీటి సామర్థ్యం 0.4 టీఎంసీలు..
కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన బయ్యారం పెద్ద చెరువు 0.4 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగి ఉంది. రెండుగుట్టలను కట్టలుగా చేసుకొని నిర్మించిన చెరువుకట్ట 2.37 కిలోమీటర్ల మేర ఉండగా.. 987 ఎకరాల్లో నీరు నిల్వ ఉంటుంది. చెరువు పైభాగంలో సుమారు 100 కిలోమీటర్ల దూరంలో వర్షం కురిసినా.. చెరువులోకి పందిపంపుల, మసివాగుల ద్వారా వరద నీరు వస్తుంది.
ఏటా రాష్ట్రంలో ఉన్న మీడియం ప్రాజెక్టుల్లో మొదట నీరు నిండి అలుగు పోసేది బయ్యారం పెద్ద చెరువుగా రికార్డులో ఉంది. చెరువు కింద 7,200 ఎకరాలు అధికారికంగా సాగవుతున్నట్లు తెలుపుతున్నప్పటికీ.. అనధికారికంగా మరో 7,200 ఎకరాల భూమి సాగవుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.
నాడే గొలుసుకట్టుకు అంకురార్పణ..
కాకతీయుల కాలంలోనే.. ముందుచూపుతో వరద నీరు వృధాగా పోకుండా గొలుసుకట్టు చెరువులను నిర్మించారనడానికి బయ్యారం పెద్దచెరువే ఉదాహరణ. బయ్యారం పెద్దచెరువు నిండిన తరువాత అలుగునీరు వృధాగా పోకుండా.. అలుగునీటిపై కొత్తపేట సమీపంలోని కమలాయకట్టును నిర్మించారు. ఈ కట్టుద్వారా కాల్వను మళ్లించి గార్ల పెద్ద చెరువును నింపడంతో పాటు.. ఆ చెరువు అలుగు నీటిని పలు కుంటలకు సరఫరా చేశారు. కాకతీయరాజులు గొలుసుకట్టు చెరువుల ద్వారా భూములకు సాగు నీరందించారు.