Bathukamma 2021: తీరొక్క పూలతో ఫారిన్ బతుకమ్మ

కూకట్‌పల్లి: దేశంలోని పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి తీసుకువచ్చిన తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు కూకట్‌పల్లికి చెందిన గుండాల అర్చన. నెల రోజులపాటు ఆమె పూలను సేకరించి బతుకమ్మను తీర్చిదిద్దారు. న్యూజిలాండ్‌లోని తన స్నేహితులతో పూలను పార్శిల్‌లో తెప్పించారు. దేశంలోని కశ్మీర్, కన్యాకుమారి, కొడైకెనాల్, ఊటీ, బెంగళూర్ తదితర ప్రాంతాల నుంచి సైతం పుష్పాలను సేకరించి దాదాపు 13 అడుగుల మేర కమలం ఆకారంలో బతుకమ్మను పేర్చారు.
గతంలో మెదక్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ ప్రాంతాల నుంచి పూలను తీసుకురావటానికి అర్చన అత్త చంద్రమ్మ రూ.లక్షలు ఖర్చు చేసేవారు. ఈసారి ఆమె కోడలు ఏకంగా విదేశాల నుంచి పూలను తెప్పించి బతుకమ్మను పేర్చడం గమనార్హం. ఈ బతుకమ్మకు బుధవారం ప్రత్యేక పూజలు చేసి మేళతాళాలు, భారీ ర్యాలీతో ఐడీఎల్ చెరువు వద్దకు తీసుకెళ్లారు.