గాందీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సంతాన సాఫల్య కేంద్రం మరో విజయం సాధించింది. దంపతుల పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐవీఎఫ్ ద్వారా బాల భీముడు జన్మించాడు. ప్రభుత్వ సెక్టార్‌లోని గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌లో గత మూడునెలల్లో మూడు జంటలకు సంతాన సాఫల్యం కలగడం గమనార్హం. గాంధీ సూపరింటెండెంట్ ప్రొ.వాణి, ఐవీఎఫ్ సెంటర్ వైద్యులు ప్రొ. శోభ, ఫాతిమా తెలిపిన వివరాల ప్రకారం..
యాదాద్రి– భువనగిరి జిల్లా బీబీనగర్ గూడూరుకు చెందిన గౌలికర్ సౌమ్య, రవిలకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతాన భాగ్యం కలగకపోవడంతో పలు ప్రైవేటు, కార్పొరేట్ ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయించారు. అక్కడ లక్షలాది రూపాయలు వెచ్చించి సుమారు 12 సార్లు ఓవలేషన్ ఇండెక్షన్ (ఓఐ) ఇంట్రా యుటేరియన్ ఇన్‌సెమినేషన్ (ఐయూఐ) చేయించుకున్నా ఫలితం లేకపోయింది. ఏడాది క్రితం గాంధీ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు. పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, నాలుగుమార్లు ఓవలేషన ఇండెక్షన్ చేసిన తర్వాత గర్భం దాల్చేందుకు అవసరమైన ట్రీట్‌మెంట్‌ను 2025 సెప్టెంబర్ 24న ప్రారంభించి ఐవీఎఫ్ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు.
ఈ నెల 27న సౌమ్య పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. శిశువు సుమారు నాలుగు కిలోల బరువు ఉన్నాడు. ఈ తరహా వైద్యచికిత్సకు ప్రైవేటు సెక్టార్‌లో రూ.12 లక్షలు వ్యయం అయ్యేదని, నయా పైసా ఖర్చు లేకుండా యాంటినెటల్ చెకప్స్, మందులు, వైద్య చికిత్సలు, సేవలు ఉచితంగా అందించామని సూపరింటెండెంట్ ప్రొ.వాణి స్పష్టం చేశారు. తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. మరో పదిమందికి ఐవీఎఫ్ చికిత్సలు అందిస్తున్నారు. గాంధీ వైద్యులకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందనలు తెలిపారు.


