కాలమేదైనా కాలినడకే..

Asifabad District Tribals Facing Drinking Water Problem No Electricity No Road - Sakshi

ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోని ‘గోవెన’గూడేలు తాగునీటికి నీటి చెలిమలే ఆధారం.. కరెంటు లేదు.. రోడ్డు లేదు.. బడి లేక పిల్లలు చదువులకు దూరం

తిర్యాణి
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యా ణి మండలం గోవెన గ్రామపంచాయతీ అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ పంచాయతీ పరిధిలో ఐదు గూడేలు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి గోవెనగా పిలుస్తారు. 361 మంది జనాభా ఉన్నారు. దశాబ్దాలుగా ఈ గూడేలు ఉనికిలో ఉన్నా.. ఇప్పటివరకు ఎలాంటి మౌలిక సదుపాయాలులేవు. కరెంటు సౌకర్యం లేదు.

నాయకపుగూడ, కుర్సిగూడ గ్రామాలైతే అత్యంత వెనుకబడి ఉన్నాయి. పదేళ్ల క్రితం ఐటీడీఏ ఆధ్వర్యంలో సోలార్‌ విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేసినా.. నిర్వహణ లేక ఐదేళ్ల క్రితం చెడిపోయాయి. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగం గా ఏర్పాటు చేసిన నాలుగు సోలార్‌ లైట్లు మాత్రమే ప్రస్తుతం వీరికి వెలుగునిస్తున్నాయి. ఈ గూడేలకు తాగునీటి సౌకర్యం లేదు.

కనీసం ఒక్క చేతిపంపు కూడా వేయలేదు. మిషన్‌ భగీరథ ట్యాంకులు అలంకారప్రాయంగా మిగిలాయి. నాయకపుగూడ వాసులు సమీపంలోని వాగులో చెలిమ తవ్వి నీళ్లు తెచ్చుకుంటున్నారు. వానాకాలంలో వాగు లో ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు చెలిమ నీరు కూడా దొరకదు. మిగతా నాలుగు గూ డేల వారు కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.

కాలినడకనే ప్రయాణం
ఐదు గూడేల ప్రజలు ఏ అవసరమున్నా కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిందే. ప్రతినెలా రేషన్, పింఛన్, ఆస్పత్రి, సామగ్రి కోసం దట్టమైన అటవీ ప్రాంతంలో రెండు వాగులను దాటుకుంటూ.. ఐదు కిలోమీటర్లు నడిచి ఆసిఫాబాద్‌ మండలం బలాన్‌పూర్‌కు చేరుకుంటారు. లేదా ఆరు కిలోమీటర్లు నడిచి లింగాపూర్‌ మండలం రాఘవపూర్‌కు వెళ్లి.. అక్కడి నుంచి వాహనాల ద్వారా తిర్యాణికి వెళ్లాల్సి ఉంటుంది.

గతంలో పోలీసులు బలాన్‌పూర్‌ మీదుగా గోవెనకు మట్టిరోడ్డు నిర్మించినా.. వరదలతో నామరూపాల్లేకుండా పోయింది. అత్యవసర సమయంలో ఆస్పత్రులకు వెళ్లడానికి 108 వాహనం రాలేని పరిస్థితి. పంచాయతీ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రం కూడా లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదు. నాయకపుగూడలో తలపెట్టిన పాఠశాల భవనం నేటికి అసంపూర్తిగానే ఉంది. ఇక్కడి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు.

మాగోస ఎవరికీ రావొద్దు: ముత్తినేని రాజమ్మ, నాయకపుగూడ
మాకు సర్కారు నుంచి రేషన్‌ బియ్యం తప్ప ఎలాంటి లబ్ధి జరగడం లేదు. తాగడానికి నీళ్లు, కరెంటు, రోడ్డు లేవు. ఎవరూ పట్టించుకోవడం లేదు. చెలిమ నీళ్లే తాగుతున్నం. ఆపద వస్తే కిలోమీటర్ల దూరం నడిచి ఆస్పత్రులకు పోతున్నాం. కరెంటు కోసం అధికారులను అడిగితే ఫారెస్టు అనుమతులు రావట్లేదని చెప్తున్నారు. మా గోస ఎవరికీ రావొద్దు.

చేతి పంపులైనా వేయాలె..
మా గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం లేదు. పిల్లలకు పౌష్టికాహరం కోసం ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. కనీసం తాగునీటి కోసం గ్రామంలో చేతి పంపు అయినా వేయాలి. రోడ్డు సౌకర్యం కల్పించాలి.

– కొడప లచ్చుబాయి, గోండుగూడ 

ఈ ఫొటోలో కంకర రాళ్ల కుప్పలా కనిపిస్తున్నది ఏమిటో తెలుసా? ఓ గ్రామానికి వెళ్లే రోడ్డు! ఇది నిజమే.. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం గోవెన పంచాయతీకి వెళ్లేందుకు దారి ఇదే. రాత్రిపగలు.. ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా.. ఈ దారి మీదుగా కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top