హనుమకొండలోని టీజీఎన్పిడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా
నేటి నుంచి సమ్మె.. ప్రకటించిన ఆర్టీజన్ ఉద్యోగుల జేఏసీ
సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీడీసీఎల్ సీఎండీ
అమల్లోకి ఎస్మా... ఆరు నెలలపాటు ఎలాంటి సమ్మెలు చేయకుండా నిషేధం
సాక్షి, హైదరాబాద్/హనుమకొండ: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, ఆర్టీజన్‌లను రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చాలని, అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్‌లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్‌లను ఆర్టీజన్‌లుగా కన్వర్షన్ చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని టీజీఎన్పిడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్ ఉద్యోగులు, అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్‌లు, ఇతర కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎనీ్పడీసీఎల్ ప్రధాన కార్యాలయం ముందు ప్రధాన రహదారి మొత్తం విద్యుత్ ఉద్యోగులతో నిండిపోయింది.
ఈ నెల 8వ తేదీ ఉదయం 9 గంటల నుంచి తాము సమ్మెకు వెళ్లనున్నట్లు ఆర్టీజన్ ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రకటించారు. ప్రతి ఆర్టీజన్, అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్‌లు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొనాలని, డివిజన్, సర్కిల్ కార్యాలయాల వద్ద శిబిరాలు ఏర్పాటు చేసి దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు. సమ్మెకు రెగ్యులర్ ఉద్యోగుల సంఘాల నాయకులు సైతం మద్దతు ప్రకటించారు. అవసరమైతే తాము కూడా సమ్మెలోకి వస్తామన్నారు.
ప్రభుత్వం వెంటనే జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి సమ్మెను నివారించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పవర్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్, టీఎస్‌ఈఈయూ–1104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, టీఆర్‌వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జాన్సన్, తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె శశికుమార్, టీఎస్‌ఈఈయూ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ రావు, తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎస్.సతీష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ సమ్మెకు వెళ్లేలా ప్రభుత్వం పరిస్థితులు క ల్పించిందన్నారు.
ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కాగా, ఎస్పీడీసీఎల్ పరిధిలో ఈ సమ్మెను అడ్డుకోవడానికి సమ్మెను నిషేధిస్తూ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలో ప్రశాంతవాతావరణం క ల్పించడానికి ‘ఎస్మా’ను అమలులోకి తీసుకుని వస్తున్నామని, ఆరు నెలలపాటు ఎలాంటి సమ్మెలు చేయకుండా నిషేధం విధిస్తున్నట్లు సీఎండీ వెల్లడించారు. ఆర్టిజన్స్ సమ్మె నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎండీ ఆదేశించారు.


