కాంటాక్ట్‌లెస్‌ ఎఫ్‌ఐఆర్‌ | AI Drone Based Policing System TG-QUEST Set To Transform Surveillance In Malkajgiri Commissionerate | Sakshi
Sakshi News home page

కాంటాక్ట్‌లెస్‌ ఎఫ్‌ఐఆర్‌

May 29 2026 12:17 PM | Updated on May 29 2026 1:23 PM

Artificial Intelligence Based Drone Policing System

కృత్రిమ మేధస్సు ఆధారిత డ్రోన్‌ వ్యవస్థ టీజీ–క్వెస్ట్‌ సేవలు

త్వరలోనే మల్కాజిగిరి కమిషనరేట్‌లో అమలు

నేరాలు అధికంగా జరిగే క్రైమ్‌ హాట్‌ స్పాట్స్‌ గుర్తింపు

పునరావృత నేరస్తులపై ప్రత్యక్షంగా కేసులు3

620 మంది సిబ్బందితో ప్రత్యేక విభాగం

డ్రోన్‌ నిర్వహణ, మరమ్మతుల కోసం ప్రయోగశాల

సాక్షి, సిటీబ్యూరో: కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత డ్రోన్ల పోలీసింగ్‌ వ్యవస్థ అయిన ‘టీజీ– క్వెస్ట్‌’ సేవలు మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్‌లో అందుబాటులోకి రానున్నాయి. దీంతో చేతిలో లాఠీ, ఒంటిపై ఖాకీ యూనిఫాంతో నేరస్తుల భరతం పట్టే పోలీసులు.. ఇక నుంచి డ్రోన్లను ఎగరేస్తూ నిఘా పెట్టనున్నారు. ప్రతి ఠాణాలో నేరాల తీరు, కారణాలు, నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు.. ఇలా అన్ని కోణాలలో విశ్లేíÙంచి క్రైమ్‌ హాట్‌ స్పాట్లను గుర్తిస్తారు.

దీని ఆధారంగా పదే పదే నేరాలకు పాల్పడే వారిపై (రిపీటెడ్‌ అఫెండర్లు) పోలీసులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లకుండానే.. కాంటాక్ట్‌ లెస్‌ ఫస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఎఫ్‌ఐఆర్‌) నమోదు చేస్తారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనదారులపై చలాన్లు, జరిమానాలూ విధిస్తారు. డ్రోన్లు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్‌ అనలిటిక్స్‌తో కూడిన సమీకృత నిఘా వ్యవస్థే ఈ టీజీ–క్వెస్ట్‌. వైమానిక గస్తీ పోలీసు నెట్‌వర్క్‌ అయిన ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం నేరాల నియంత్రణ, ట్రాఫిక్‌ నిర్వహణ, ప్రజా భద్రత. 

ఎలా పని చేస్తుందంటే? 
ఏఐ డ్రోన్లు ముందుగా నిర్దేíÙంచిన జీపీఎస్‌ లొకేషన్‌కు చేరుకొని ఆకాశంలో ఎగురుతూ.. ఆయా ప్రాంతంలో సంచరిస్తున్న వ్యక్తులు, వాహనాల లైవ్‌ ఫొటోలు, వీడియోలను తీస్తుంది. ఆల్గరిథం ఆధారంగా ఫుటేజ్‌లను విశ్లేషించి.. అనుమానితుల ముఖాలను పోలీసు డేటాబేస్‌తో సరిపోల్చుతుంది. రిపీటెడ్‌ అఫెండర్‌ అయితే వెంటనే స్థానిక పెట్రోలింగ్‌ వాహనాలకు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు హెచ్చరికలను పంపిస్తుంది.

పోలీసులు, పెట్రోలింగ్‌ వాహనాలు భౌతిక గస్తీపై ఆధారపడకుండా లైవ్‌ అనలిటిక్స్‌ ద్వారా క్రైమ్‌ హాట్‌ స్పాట్లు, రిపీటెడ్‌ అఫెండర్ల కదలికలను రిమోట్‌గా ట్రాక్‌ చేస్తుంటుంది. బస్తీలు, కూడళ్లు, బాటిల్‌ నెక్‌ ప్రాంతాలు, పోకిరీల అడ్డాలు, రాత్రి వేళ్లలు, సిబ్బంది మెహరింపు తక్కువగా ఉండే ప్రాంతాలు, పెట్రోలింగ్‌ విరామ సమయాలు, నిర్మానుష్య ప్రాంతాలు, నేరాలు అధికంగా జరిగే హాట్‌ స్పాట్లలో క్రమం తప్పకుండా ఏఐ డ్రోన్లు పర్యవేక్షిస్తాయి. 

నేరస్తుల కదలికలు, ట్రాఫిక్‌ నియంత్రణ.. 
అనుమతించిన సమయం దాటినా తెరిచి ఉంచే పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, ఇతరత్రా వాణిజ్య సముదాయాలను గుర్తిస్తుంది. ఇలాగే ఆయా ప్రాంతాలలో అనుమానాస్పద వ్యక్తులు, చోరికి గురైన వాహనాల కదలికలు, పెండింగ్‌లో ఉన్న వారెంట్లు, తప్పిపోయిన వ్యక్తులు వంటి పోలీసు డేటా బేస్‌లను తనిఖీ చేస్తుంది. ఏమాత్రం ఆధారం లభించినా వెంటనే స్థానిక ఠాణాలకు సమాచారం అందిస్తుంది. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం కూడా ఏఐ డ్రోన్లను వినియోగిస్తారు. రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్, అక్రమ పార్కింగ్, అతివేగం వంటి ఉల్లంఘనలను గుర్తించి వీడియో సాక్ష్యాలతో కూడిన చలాన్లు, జరిమానాలను జారీ చేస్తుంది. అలాగే అంబులెన్స్‌ రాకపోకలకు మార్గాలను క్లియర్‌ చేయడంలో కూడా సహాయపడుతుంది.

డ్రోన్‌ ల్యాబ్, సిబ్బందికి శిక్షణ.. 
ఏఐ డ్రోన్లు నిర్వహణ, మరమ్మతు, డేటా విశ్లేషణ కోసం ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2020–24 మధ్య నియమితులైన పోలీసు సిబ్బంది, వారి విద్యార్హతలను పరిశీలించారు. దాదాపు 2,400 మంది కానిస్టేబుళ్లు, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్లలో 620 మంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను గుర్తించారు. పోలీసు స్టేషన్లలో డ్రోన్‌ కార్యకలాపాలు, నిఘా విశ్లేషణ, అనలిటిక్స్, రియల్‌ టైం ఆపరేషనల్‌ పర్యవేక్షణ, వివిధ భద్రతా విభాగాలపై దృష్టి సారించే సాంకేతికత ఆధారిత పోలీసింగ్‌ యూనిట్లకు నాయకత్వం వహించేందుకు ఈ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. డ్రోన్‌ ఇన్‌ఫ్రా, నిర్వహణ, మరమ్మతుల కోసం ప్రత్యేక ప్రయోగశాల కూడా అభివృద్ధి చేస్తున్నారు.

సాంకేతిక అంశాల విశ్లేషణ..  
44 లక్షల జనాభా ఉన్న మల్కాజిగిరిలో సంక్లిష్టమైన పట్టణ కదలికలను, వేగంగా మారుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి సంప్రదాయ పోలీసింగ్‌ విధానాలు అంకంతకూ సరిపోవడం లేదు. ఏఐ రియల్‌ టైమ్‌ పోలీసింగ్‌ అనివార్యం. ప్రస్తుతం సీసీటీవీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక అంశాల విశ్లేషణ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. – బి.సుమతి, మల్కాజిగిరి కమిషనర్‌ 

Advertisement
 
Advertisement
Advertisement