
త్వరలో సీడబ్ల్యూసీకి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు
ఇప్పటికే ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు
ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లభిస్తే కేంద్రం నుంచి నిధులు
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతలు పథకానికి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) దరఖాస్తు చేయనుంది. ప్రాజెక్టు అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) కార్యాలయానికి సమర్పించారు. సీతారామ ఎత్తిపోతలు పథకం–సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు జారీ చేస్తూ సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) గత ఏప్రిల్‌లో నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్‌ను సాధిస్తే ప్రధానమంత్రి క్రిషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) పథకం కింద కేంద్ర ప్రభుత్వ నిధులను రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సీతారామ ఎత్తిపోతలు పథకానికి ఇప్పటికే పర్యావరణ అనుమతులుండగా, సీతమ్మసాగర్‌కు ఇంకా రావాల్సి ఉంది. దీంతో ఈ ప్రాజెక్టుకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ వచ్చే అవకాశాలు లేవు.
ఈ నేపథ్యంలోనే సీతారామ ప్రాజెక్టుకు మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ రెండు ప్రాజెక్టులు ఒకే ప్రాజెక్టుగా ఉండేవి. సీతారామ–సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం డీపీఆర్ కూడా సిద్ధం చేసింది. అయితే ఇప్పుడవి వేర్వేరు ప్రాజెక్టులుగా మారాయి.
ప్రతిపాదనలు పరిశీలించి సిఫారసు
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీ పరిశీలించి కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని కేంద్ర జలవనరుల శాఖకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ కోసం సిఫారసు చేయనుంది. ఈ సిఫారసుల ఆధారంగా ప్రాజెక్టుకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ విషయంలో జలవనరుల శాఖ నిర్ణయం తీసుకోనుంది. అంతకుముందు ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత? ఇప్పటివరకు చేసిన ఖర్చు ఎంత? చేయాల్సిన ఖర్చు ఎంత? రాష్ట్ర బడ్జెట్‌లో ఏటా కేటాయించిన నిధులు ఎంత? వంటి అంశాలను సీడబ్ల్యూసీ పరిశీలించనుంది. ఇతర సాగునీటి ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం పడకుండా ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమేనా? అనే అంశాలనూ సమీక్షించనుంది.
మొత్తం 4 ప్రాజెక్టులపై దృష్టి
సీతారామతో పాటు మోడికుంటవాగు, చనాకా–కొరాటా, చిన్నకాళేశ్వరం.. మొత్తం 4 ప్రాజెక్టులకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్‌లు సాధించి పీఎంకేఎస్‌వై కింద కేంద్ర నిధులు రాబట్టుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే 57 శాతం పనులు పూర్తి
గత ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 18వ తేదీన రూ.7,926.14 కోట్ల అంచనాలతో సీతారామ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు ఇవ్వగా, ఆ తర్వాత 2018 ఆగస్టులో రూ.13,057 కోట్లకు అంచనాలను సవరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ద్వారా 67.05 టీఎంసీల గోదావరి జలాలను తరలించి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మొత్తం 7.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరుతో పాటు తాగునీరు సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రాజెక్టులో భాగంగా మొత్తం 757 మెగావాట్ల సామర్థ్యంతో 11 పంప్‌హౌస్‌లు, 36.57 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సీతమ్మసాగర్ బరాజ్‌ను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తైతే సాగర్, పాలేరు, వైరా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి కొరత తీరుతుంది. ఇప్పటివరకు రూ.11,320 కోట్ల వ్యయంతో 57 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ పథకాన్ని 2026 నాటికి పూర్తి చేసి రబీ పంటలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లభిస్తే పీఎంకేఎస్‌వై కింద కేంద్ర ప్రభుత్వ నిధులను రాబట్టుకుని మిగులు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.